
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదా? మాటిమాటికీ మెలకువ వస్తుందా? అయితే మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లే. రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోకపోతే డిప్రెషన్, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

నిద్ర సమస్యలను తొలగించాలనుకుంటే ఒత్తిడిని తగ్గించడం చాలా ముఖ్యం. యోగా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. అలాగే కొన్ని ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌కి ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇందులో అధిక మొత్తంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి.. నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. అవి కండరాలను సడలించడంలో సహాయపడతాయి. పైగా అరటిపండులోని అమైనో ఆమ్లాలు సెరోటోనిన్ హార్మోన్‌ను మెలటోనిన్‌లుగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది నిద్ర సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు శారీరక మంటను తగ్గిస్తుంది. సముద్రపు ఆహారంలో నిద్రకు అవసరమైన విటమిన్ డి కూడా ఉంటుంది.

నానబెట్టిన బాదంపప్పులను ప్రతిరోజూ ఒక గుప్పెడు తినాలి. బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించడానికి, తగినంత విశ్రాంతిని అందించడానికి సహాయపడుతుంది.

బెర్రీలలో మెలటోనిన్ ఉంటుంది. ఈ హార్మోన్ నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ తాగితే గాఢ నిద్ర వస్తుంది. రాత్రి పడుకునే ముందు చమోమిలే టీ తాగొచ్చు. చమోమిలే టీ ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. చమోమిలే టీ కూడా అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.