Side Effects of Tea: తేనీరు.. టీ.. చాయ్.. ఏమన్నా కానీ.. దీన్ని టేస్ట్ చేయని వారంటూ ఉండరు.. ఉదయం లేచినప్పటినుంచి.. రాత్రి పడుకునే వరకు టీ తాగే వారికి కొదవే ఉండదు.. టీలో చాలా రకాలు ఉన్నాయి.. పాలతో తయారు చేసే టీ.. తాగడం వల్ల శరీరానికి తాజాదనం లభిస్తుంది. తలనొప్పి, చిరాకు, అలసటను దూరం చేయడంలో టీ చాలా సహాయపడుతుంది. అందుకే.. టీ అంటే చాలా మందికి ఇష్టం. కొందరు గంట గంటకు లేదా రెండు గంటలకొకసారి తాగేవారున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టీ తాగితే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయన్న విషయం మీకు తెలుసా..? అతిగా టీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం..
అధిక మొత్తంలో టీ తాగడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో ఉండే టానిన్లు శరీరంలోని కొన్ని పోషకాల శోషణను ప్రభావితం చేస్తాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయంటూ పేర్కొంటున్నారు. ఎక్కువగా టీ తాగడం వల్ల కలిగే ప్రతికూలతలు ఏంటో తెలుసుకోండి..
నిద్ర ప్రభావితం అవుతుంది: టీలో కెఫీన్ ఉంటుంది. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. మీరు అతిగా టీ తాగితే నిద్రలేమికి గురవుతారు. దీని కారణంగా ఒత్తిడి, చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
గుండెల్లో మంట సమస్య: కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటకు కారణమవుతుంది.
డీహైడ్రేషన్ సమస్య: టీ ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీయవచ్చు. ఇందులో ఉండే కెఫిన్ శరీరం నుంచి నీటిని గ్రహిస్తుంది. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.
ఐరన్ లోపం: టీలోని టానిన్లు మీ జీర్ణవ్యవస్థలో ఐరన్ శోషణను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా శరీరంలో రక్త కొరత ఏర్పడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
దంత సమస్యలు: అధిక మొత్తంలో టీ తాగడం వల్ల మీ దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాకుండా, కుహరం సమస్య కూడా రావొచ్చు. మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మితంగా టీ తాగండి.