
ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్న అవి ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు నరక యాతన అనుభవిస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో గంటల తరబడి నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి దాపురించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోగులకు,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆసుపత్రి యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నిత్యం వందలాది మంది గర్భిణీలు చెకప్‌ల కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు.

అయితే,ఇక్కడి ఓపీ వద్ద వీరు కూర్చోవడానికి కనీసం కుర్చీలు, బెంచీలు కూడా అందుబాటులో లేవు. నెలలు నిండిన గర్భవతులు, నిలబడలేని స్థితిలో ఉన్న మహిళలు గంటల తరబడి నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గంటల కొద్దీ ఓపీ లైన్లలో వేచి ఉండలేక, కూర్చోవడానికి చోటు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆసుపత్రి సిబ్బంది కంటి ముందే ఇదంతా జరుగుతున్నా,వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ పరిస్థితిపై గర్భిణీల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు తక్షణమే అవసరమైన సౌకర్యాలు కల్పించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.