
ఆరోగ్యంగా జీవించడానికి, చర్మ సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. అయితే స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్నిరకాల తప్పులు చేయడం వల్ల అనారోగ్యం బారీన పడుతుంటారు. దీనిని నివారించాలంటే.. కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

మీకూ వేడి నీళ్లలో స్నానం చేసే అలవాటు ఉందా? రోజు చివరిలో వెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనె, తేమ కోల్పోవడం జరుగుతుంది. అందువల్లనే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడానికి ప్రయత్నించండి.

లూఫాతో చర్మాన్ని స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. అయితే చాలా మంది తమ గోళ్లతో చర్మాన్ని రుద్దుతుంటారు. కానీ చర్మాన్ని ఎక్కువగా స్క్రబ్ చేస్తే దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. లూఫా వినియోగించేవారు స్నానం తర్వాత దానిని పూర్తిగా శుభ్రం చేసి, ఆరబెట్టుకోవాలి. తడి లూఫాలలో చర్మానికి హానితలపెట్టే బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి వాటిని స్నానం చేసే ప్రతిసారీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

ఒత్తిడితో చర్మాన్ని రుద్ద కూడదు. షాంపూ రాసుకున్న తర్వాత చాలా మంది తలలో చేతి వేళ్లతో బలంగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ పెరగడానికి బదులు జుట్టు రాలిపోతుంది. ఎక్కువగా స్కాల్ప్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల చివర్లు చీలిపోతాయి.

చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బు వినియోగిస్తుంటారు. అయితే సరైన సబ్బును ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సబ్బులో ఆల్కలీ ఉంటుంది. ఇది చర్మం సహజ నూనెలను నాశనం చేసి, చర్మాన్ని పొడిగా, గరుకుగా మార్చుతుంది. సబ్బుకు బదులుగా షవర్ జెల్ లేదా బాడీ వాష్‌ని ఎంచుకోవచ్చు.స్నానం చేసిన తర్వాత కూడా చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరం పూర్తిగా ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తడి చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోకూడదు. మాయిశ్చరైజర్ చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.