
ఇష్టంలేని పని చేయాలంటే ఎవరికైనా విసుగు వస్తుంది. అసక్తి అసలే రాదు. ఇక పరీక్షలు దగ్గరపడే కొద్దీ చదవాల్సిన సిలబస్ అమాంతం కొండలా పెరిగిపోతుంటుంది. పుస్తుకం పట్టాలంటే మహా విసుగు కమ్ముకొస్తుంది. ఇంకేముంది వాయిదాలు వేస్తూ ఉంటారు. తీరా పరీక్ష రోజు కంగారు పడిపోతుంటారు. పుస్తకం పట్టగానే ఆసక్తిగా చదవాలంటే కొన్ని కిటుకులు పాటిస్తే సరి. అవేంటంటే..

ఒకే సబ్జెక్టును గంటలకొద్దీ చదువ కూడదు. ప్రతి అరగంటకోసారి లేదా గంటకోసారి మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. విరామ సమయంలో ఒకేచోట కూర్చుని ఉండకుండా లేచి నిలబడి అటూఇటూ నడవాలి. ఈ విధంగా ఒక్కో సబ్జెక్టుకు సమయాన్ని కేటాయిస్తూ చదవడం వల్ల రోజంతా ఆసక్తిగా చదువుతారు.

చదువుకునే చోటు గాలీ, వెలుతురూ వచ్చేలా ప్రశాతంగా ఉండాలి. ఎలాంటి అవాంతరాలూ లేకుండా చూసుకుంటే దృష్టి అనవసర విషయాల మీదకు మళ్లకుండా శ్రద్ధగా చదువుతారు.

చదవడానికి కూర్చునేటప్పుడు అన్ని పుస్తకాలు, ఇతర వస్తువులు ఒకేచోట అందుబాటులో పెట్టుకోవాలి. మాటిమాటికీ లేచి వెళ్తుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది.

పోటీతత్వం ఉంటే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనే తపనతో ఆసక్తి దానికదే వస్తుంది.