హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అంచనా వేస్తుంది. అక్టోబర్ నెల మొత్తం పూర్తిగా పొడిబారిన వాతావరణం కనిపించింది.
దీంతో సుదీర్ఘ పొడి వాతావరణం తర్వాత ఈ జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణం కేంద్రం అంచనా ప్రకారం ఉరుములతో కూడిన జల్లులు మధ్యాహ్న సమయం లేదా సాయంత్రం వేళల్లో కురిసే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా పడుతున్న ఈ వర్షాలు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం లేదని కొద్ది ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణంలో ఎదురయ్యే మార్పుల కోసం లోతట్టు ప్రాంతాల ప్రజలు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చిరుజల్లులు పడే ఇలాంటి సమయంలో ఒకటి ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.
రాత్రివేళలో ఉష్ణోగ్రతలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దాదాపు 22 డిగ్రీల సెల్సియస్‌లో రాత్రులు ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోని గత ఐదు రోజుల నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 8 వరకు తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణలో సాయంత్రం రాత్రివేళలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.