పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గుజరాత్ కేవడియాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి (అక్టోబర్ 31న) ని పురస్కరించుకుని మేజ్ పార్క్‌తో పాటు, మియావాకి ఫారెస్ట్‌ను ప్రారంభించనున్నారు. 4 ఏళ్ల క్రితం ప్రధాని ఇదే ప్రాంతంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ భారీ విగ్రహాన్ని సందర్శించడానికి ఏటా ఇక్కడికి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఇప్పటి వరకు 8 మిలియన్లకుపైగా మంది సందర్శించారు.
కేవాడియాలోని ఏక్తా నగర్‌కు వచ్చే పర్యాటకులకు మియావాకీ ఫారెస్ట్ మరో పర్యాటక కేంద్రంగా మారనుంది. ఈ అడవికి జపాన్‌కు చెందిన వృక్షశాస్త్రజ్ఞుడు, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ అకిరా మియావాకి పేరును పెట్టారు.
మియావాకి విధానంలో ఒక అడవిని కేవలం రెండు నుంచి మూడేళ్లలోనే అభివృద్ధి చేయొచ్చు. అయితే సంప్రదాయ పద్ధతిలో ఇది సాధ్యం కావడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఈ విధానంలో వివిధ జాతుల మొక్కలను పక్కపక్కన నాటుతారు.
మియావాకి పద్ధతి వల్ల మొక్కలు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. దీంతో అడవి 30 రెట్లు దట్టంగా ఉంటుంది. ఈ ఫారెస్ట్‌లో ఫ్లవర్ పార్క్, కలప తోట, పండ్ల తోట, ఔషధ మొక్కల తోట, మిశ్రమ జాతుల మియావాకి విభాగం, డిజిటల్ ఓరియంటేషన్ సెంటర్ ఉన్నాయి.
ఇక స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సమీపంలో ఉన్న ఇతర ప్రధాన పర్యాటక ప్రదేశాలు టెన్త్ సిటీ, ఆరోగ్య వాన్ (హెర్బల్ గార్డెన్), బటర్‌ఫ్లై గార్డెన్, కాక్టస్ గార్డెన్, విశ్వ వాన్, ఫ్లవర్స్ వ్యాలీ, యూనిటీ గ్లో గార్డెన్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్, జంగిల్ సఫారి వంటి థీమ్ బేస్‌డ్ పార్కులను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే 2014లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అక్టోబర్ 31)ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను, అంకిత భావాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.