Balaraju Goud |
Jan 12, 2022 | 2:09 PM
చెమట కష్టం, సృజనాత్మకత తోడైతే అద్భుతమైన కళాకృతి. నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ (Nalla Vijay)ను తెలంగాణ మంత్రులు అభినందించారు.
మంగళవారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీ రామారావు , ఎర్రబెల్లి దయాకర్ రావు , సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో నేతన్న విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చీరను ప్రదర్శన చేశారు.
అత్యంత పలుచనైన చీరను ఆసక్తిగా గమనించిన మంత్రులు చీర వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. విజయ్ పై ప్రశంసల జల్లు కురుపించారు. నేతన్న నైపుణ్యాన్ని కొనియాడిన మంత్రులు.. ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని చెప్పారు.
విజయ్ చేతి నుంచి తీర్చిదిద్దుకున్న ఈ చీరను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల నేత రంగంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి సబితా చెప్పారు. విజయ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.
సిరిసిల్ల నేత కార్మికుల ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు మరలుతున్నారని నేత కార్మికుడు విజయ్ తెలిపారు. ఇప్పుడు తాను నేసిన చీర మూడు రోజుల్లో మర మగ్గాలతో నేయవచ్చని అన్నారు. అయితే, ఈ చీరను చేతితో నేయాలంటే రెండు వారాలు పడుతుందని విజయ్ అన్నారు.