
ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు వేయాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించి, ఒకటి రెండు నిమిషాలు ఉంచాలి. దీనికి పాకం అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత, ఈ సిరప్‌ను పూర్తిగా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. పాయసంలో పాలు విరగకుండా ఉండాలంటే, బెల్లం సిరప్ పూర్తిగా చల్లగా ఉండటం చాలా ముఖ్యం.

బెల్లం కొలిచిన కప్పుతో ముప్పావు కప్పు పొడి బియ్యపు పిండిని తీసుకోవాలి. ఒక పాన్‌లో ముప్పావు కప్పు నీళ్లు, ఒక టేబుల్‌స్పూన్ బెల్లం తురుము వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి నీళ్లు వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు తీసుకున్న బియ్యపు పిండిలో ఒక టేబుల్‌స్పూన్ గోధుమపిండి కలపాలి. గోధుమపిండి వేయడం వల్ల తాలికలు ఉడికేటప్పుడు చిరిగిపోకుండా ఉంటాయి. ఈ పిండి మిశ్రమాన్ని వేడి నీటిలోకి వేసి బాగా కలపాలి. పిండి వేడిగా ఉండగానే, చేతిని తడి చేసుకుంటూ బాగా కలపాలి. పిండి పొడిపొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి, సెమీ-సాఫ్ట్ గా, జంతికల పిండి లాగా ముద్దగా చేసుకోవాలి. ఇలా వేడి మీద కలపడం వల్ల పిండిలో జిగురు ఏర్పడి తాలికలు విరగకుండా వస్తాయి.

తయారుచేసుకున్న పిండి ముద్దలో నుండి చిన్న ఉసిరికాయ సైజు అంత పిండిని పాయసం చిక్కబడటానికి పక్కన పెట్టాలి. మిగిలిన పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. జంతికల మెషిన్ లేకపోతే, కొద్దికొద్దిగా పిండిని తీసుకుని చెక్కపై లేదా ప్లేట్‌పై చిన్నగా, సన్నగా తాలికల్లా ఒత్తుకోవచ్చు.ఒక వెడల్పాటి కడాయిలో రెండు కప్పుల నీళ్లు వేసి వేడి చేయాలి. నీళ్లు కొంచెం వేడెక్కగానే నానబెట్టిన సగ్గుబియ్యం వేసి నాలుగు ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నాలుగు కప్పుల పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు, జంతికల గొట్టంతో తాలికలను నేరుగా పాలలోకి ఒత్తుతూ, చేతితో కొద్దికొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా, చిరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి. మొత్తం తాలికలు వేసిన తర్వాత, మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ నాలుగు ఐదు నిమిషాలు ఉడికించాలి.

పక్కన పెట్టిన చిన్న పిండి ముద్దను కొద్దిగా నీటిలో కలిపి, ఉండలు లేకుండా పేస్ట్ లా చేసుకోవాలి. తాలికలు ఉడికాక, ఈ పిండి మిశ్రమాన్ని పాయసంలోకి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఒక టేబుల్‌స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి చివరిలో వేయడం వల్ల రుచి మరింత బాగుంటుంది. స్టవ్ మంటను తగ్గించి లేదా ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ను వడగట్టి పాయసంలో కలపాలి. బాగా కలిపి రెండు నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. పాయసం చల్లబడే కొద్దీ చిక్కబడుతుంది.

చివరగా, ఇంకొక పాన్‌లో రెండు మూడు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి, కట్ చేసిన బాదం, జీడిపప్పు పలుకులను వేయించాలి. అవి ఎరుపు రంగులోకి వచ్చాక, కొన్ని కిస్‌మిస్‌లు వేసి వేయించి పాయసంలో కలపాలి. అర టీస్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపితే కమ్మని పాలతాలికల పాయసం సిద్ధం.