
మన వంటింట్లో నిత్యం కనిపించే పల్లీలను కేవలం రుచి కోసం మాత్రమే తింటాం. కానీ, వీటిలో దాగి ఉన్న పోషకాలు ఖరీదైన బాదం, జీడిపప్పు కంటే తక్కువేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది భయపడతారు, కానీ వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంది. వేరుశెనగలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచుతాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

పల్లీలలో మన శరీరానికి మేలు చేసే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. వీటిలో ఉండే ప్లాంట్ స్టెరాల్స్ మనం తీసుకునే ఆహారంలోని కొలెస్ట్రాల్ రక్తంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ధమనులలో పూడికలు ఏర్పడకుండా అథెరోస్క్లెరోసిస్ వంటి గుండె జబ్బుల ప్రమాదం తప్పుతుంది.

సాధారణంగా రెడ్ వైన్ లేదా ద్రాక్షలో కనిపించే రెస్వెరాట్రాల్ అనే అరుదైన పాలీఫెనాల్ వేరుశెనగల్లో ఉంటుంది. ఇది రక్తనాళాలను మృదువుగా ఉంచి, రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఆలివ్ నూనెలో ఉండే ప్రయోజనాలే వేరుశెనగల్లోని ఒలిక్ ఆమ్లం ద్వారా లభిస్తాయి. ఇది గుండె సంబంధిత వాపులను తగ్గిస్తుంది. ఆర్జినైన్ ఇందులోని అమైనో ఆమ్లాలు రక్తనాళాలను విస్తరింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

వేరుశెనగల్లో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను సడలిస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే విటమిన్ ఇ, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. ఇందులో పీచుపదార్థం, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.

వైద్య నిపుణుల ప్రకారం.. వేరుశెనగలను తినే విధానం చాలా ముఖ్యం. పల్లీల ఎర్రటి పొట్టులో ప్రోయాంథోసైనిడిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె కండరాలను బలపరుస్తాయి. కాబట్టి పొట్టు తీయకుండా తినడం శ్రేయస్కరం. నూనెలో వేయించినవి లేదా ఎక్కువ ఉప్పు కలిపిన వేరుశెనగలు తింటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అందుకే సాదాగా వేయించినవి లేదా ఉడకబెట్టినవి తీసుకోవాలి. రోజుకు సుమారు 25-30 గ్రాముల వేరుశెనగలు తింటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెపోటు ముప్పును 25 నుండి 30 శాతం వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.