
ఈ ప్రత్యేక నగరం గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ నగరం పేరు పాలిటానా. ఈ నగరం మాంసాహార ఆహారాన్ని అధికారికంగా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా ప్రసిద్ధి చెందింది. దానికి కారణం? అహింసపై లోతైన పాతుకుపోయిన నమ్మకం అని చెబుతారు.

ఈ నగరంలో గత 900 సంవత్సరాలలో నిర్మించబడిన 800 కి పైగా రాతితో చేసిన జైన దేవాలయాలు ఉన్నాయి. అందుకే దీన్ని దేవాలయ నగరం అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన జైన యాత్రా స్థలాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ నగరంలో జంతువులను చంపడం, మాంసం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది జైన సన్యాసులు 2014 లో నిరాహార దీక్ష చేశారు.

జైనులు నిరసనలతో ప్రభుత్వం బలితానాలో మాంసం, చేపలు, గుడ్ల అమ్మకం, కొనుగోలు, వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. అప్పటి నుంచి ఈ నగరంలో మాంసాహారంపై నిషేదం అమల్లో ఉంది.

పాలితానాలోని ఆహారం జైన తత్వశాస్త్రం స్వచ్ఛత, అహింస పద్దతులను తెలియజేస్తుంది. వీరు నేలలోని జీవులకు హాని కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు వంటి వేరు కూరగాయలను కూడా తినరు. ఇక్కడ చాలా మంది జైనులు పాలు, పాల ఉత్పత్తులను కూడా తినరు.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు, ఇక్కడి జనాలు డోక్లా, కాండివి, ఖాదీ, ఖాటియా, దాల్ డోక్లి వంటి సాంప్రదాయ గుజరాతీ శాఖాహార వంటకాలను ఆస్వాదించవచ్చు. భారతదేశంలోని ఇతర ఆధ్యాత్మిక నగరాలు మతపరమైన ఆచారాల కారణంగా మాంసం, మద్యం నిషేధించగా, పాలిటానాలో మాత్రం కేవలం మాంసాహార ఆహారాన్ని మాత్రమే చట్టం నిషేదించారు. అందుకే ఇది నాన్‌వెజ్‌ను నిషేదించిన ఏకైక నగరంగా మారింది.