
కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి తరిగిన 3 కట్టల తాజా పాలకూర, కారానికి తగినట్లుగా 10 నుండి 15 ఎండుమిరపకాయలు, 5 నుండి 6 - పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి 2 నుండి 3 స్పూన్ల నూనె.

తయారీ విధానం: ముందుగా తాజా పాలకూరను తీసుకుని ముదురు కాడలు, పాడైన ఆకులను తీసేయాలి. ఆ తర్వాత ఆకులను సన్నగా తరిగి, ఉప్పు వేసిన నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఆకులపై ఉండే మట్టి, ఇసుక పూర్తిగా తొలగిపోతాయి. కడిగిన పాలకూరను చిల్లుల గిన్నెలో వేసి నీరు ఓడ్చాలి.

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక తొడిమలు తీసిన ఎండుమిరపకాయలను వేసి చిన్న మంటపై రంగు మారే వరకు దోరగా వేయించాలి. అందులోనే అర స్పూన్ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

అదే పాన్‌లో తరిగి పెట్టుకున్న పాలకూరను వేసి చిన్న మంటపై నూనెలో మగ్గించాలి. పాలకూరలోని సహజ తేమతోనే ఆకులు పూర్తిగా మెత్తబడి, పసరు వాసన పోయేలా మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పాలకూరను కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లేదా రోలు తీసుకుని మొదటగా వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి.

ఆ తర్వాత చల్లారిన పాలకూర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఎక్కువ సేపు తిప్పకుండా కేవలం ఒక్కటి లేదా రెండు సార్లు పల్స్ మోడ్‌లో బరకగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడికి మళ్లీ ప్రత్యేకంగా తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా బౌల్‌లోకి తీసుకుని వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే నాన్‌వెజ్ కర్రీలను మించిన సంతృప్తి కలుగుతుంది!