
రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ మహత్తరఘట్టానికి హాజరుకావాల్సిందిగా దేశవిదేశాల్లోని ఆధ్యాత్మక వేత్తలు, సాధుసంతులు, పీఠాధిపతులతో పాటు రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. వచ్చే విశిష్ట అతిథులతో భక్తజనం అందరికీ అవసరమైన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. విగ్రహ ప్రాణప్రతిష్ఠ కంటే 7 రోజుల పాటు జరగనున్న వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆయా రాష్ట్రాల కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

ఇదంతా సరే.. మరి అయోధ్యకు చేరుకుంటున్న సెలబ్రిటీల నుంచి కళాకారుల వరకు ఆతిథ్యం సంగతేంటి అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇందుకోసం ఉత్తర్‍ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లే చేస్తోంది. వీఐపీలు, కళాకారులు, సాధుసంతులు.. ఇలా వచ్చేవారిని వివిధ కేటగిరీలుగా విభజించి, వారికి తగినట్టుగా వసతి సదుపాయాన్ని కల్పిస్తోంది. రాత్రికి రాత్రే స్టార్ హోటళ్లు, వసతి గృహాలను నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి తాత్కాలికంగా టెంట్లతో వసతిని సిద్ధం చేస్తోంది. టెంట్ అనగానే ఏదో సాదాసీదాగా వేసిన బిస్తర్ అనుకుంటే పొరపాటే. స్టార్ హోటల్ సదుపాయాలతో లగ్జరీ టెంట్ సిటీని నిర్మిస్తోంది. ఆ టెంట్ సిటీకి "నిషాద్‌రాజ్ గుహ అతిథిగృహ" అని నామకరణం చేసింది.

అయోధ్యధామ్ బస్ స్టేషన్ వెనుకాల సువిశాలమైన ఖాళీస్థలంలో నిర్మిస్తున్న ఈ టెంట్ సిటీలోకి అడుగు పెట్టగానే ఆకట్టుకునే లాంజ్, పక్కనే రిసెప్షన్ ఏరియా, దానికి ఎదురుగా సీతా రసోయి, శబరి రసోయి పేరుతో ఫుడ్ కోర్టులు కనిపిస్తాయి. 'దర్బార్' కేటగిరీ పేరుతో సువిశాలమైన పడకగది, హాల్, డ్రాయింగ్ రూమ్, బాత్‌రూమ్ కలిగిన టెంట్ కాటేజీలు ఉన్నాయి. డబుల్ బెడ్ డీలక్స్ రూమ్స్ ఇద్దరికి వసతి కల్పించేలా ఉండగా.. ఇద్దరి కంటే ఎక్కువ మంది గ్రూపుగా వచ్చినా సరే వసతి కల్పించేలా షేరింగ్ డార్మిటరీలు కూడా ఉన్నాయి.

పేరుకే టెంట్‌లో ఏర్పాటు చేసినా.. స్టార్ హోటల్ సదుపాయాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా లోపల ఫర్నీచర్.. పైగా కళాత్మకత ఉట్టిపడేలా ఇంటీరియర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంత లగ్జరీ సదుపాయాలతో నిర్మిస్తున్న టెంట్ సిటీకి 'నిషాద్‌రాజ్ గుహ' పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణమే ఉంది. ఇది తెలుసుకోవాలంటే.. మనం రామాయణ ఇతిహాసం, పురాణాల్లోకి ఓసారి తొంగిచూడాల్సిందే. పురాణ కథనం ప్రకారం.. శ్రీరామచంద్రుడు, సీతా, లక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరినప్పుడు వారిని అయోధ్య రాజ్యంలోని మంత్రి సుమంత్ర తమ రథంపై గంగానది తీరంలో ఆదివాసీ రాజు నిషాద్‌రాజ్ గుహ వద్ద వదిలి వెళ్లిపోయారు. నిషాద్‌రాజ్ గుహ కేవటి రాజ్యాధినేత. తన రాజధాని శృంగవీరపుర. శ్రీరాముడు ఇక్కడే తన రాజభోగాన్ని వదిలేసి, అరణ్యవాసిగా మారారు.

రాజధాని శివార్లలో ఓ చెట్టు కింద గడ్డి, చెట్ల ఆకులతో పడక తయారు చేసుకుని శ్రీరాముడు, సీతామాత ఆ రాత్రి నిద్రించారు. వారికి లక్ష్మణుడితో పాటు కేవటి రాజ్యాధినేత నిషాద్‌రాజ్ గుహ కూడా కాపలాగా రాత్రంతా నిల్చున్నారు. మర్నాడు ఉదయాన్నే సీతారామలక్ష్మణులకు పండ్లు, కందమూలాలు ఆహారంగా అందజేశారు. ఆ తర్వాత తన పడవలో శ్రీరామచంద్రుడిని గంగా నది దాటించి అవతిలి ఒడ్డుకు చేర్చారు. అలా శ్రీరామచంద్రుడి వనవాసానికి తొలి అడుగు పడిన కేవటి రాజ్యాధినేత నిషాద్‌రాజ్ గుహ పేరు మీద టెంట్ సిటీ ఎందుకు నిర్మిస్తున్నారో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. శ్రీరామచంద్రుడి వనవాసంలో తొలి రోజు ఆతిథ్యమిచ్చిన నిషాద్‌రాజ్ గుహ ఆ రాముడికి ఆ జన్మాంతం మంచి స్నేహితుడిగా ఉన్నాడు.

14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్న తర్వాత శ్రీరాముడు మర్చిపోకుండా నిషాద్‌రాజ్ గుహను కలిశారు. అంతేకాదు, తన పట్టాభిషేకానికి కూడా ఆహ్వానించారు. శ్రీరాముడికి ఆశ్రయమిచ్చిన నిషాద్‌రాజ్ పేరిట టెంట్ సిటీని నిర్మించి ఆ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు విచ్చేసే అతిథులకు ఆతిథ్యమివ్వాలని యూపీ సర్కారు భావిస్తోంది.