శివలీల గోపి తుల్వా |
Feb 16, 2023 | 3:26 PM
పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. కొన్ని కొన్ని సందర్భాలలో అమ్మానాన్నలు చేసే పనులను చూసే నేర్చుకుంటారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ముందు తెలిసీతెలియక చేసే పనులు వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి.
అందువల్ల పిల్లల ముందు కొన్ని పనులను అసలు చేయకూడదని నిపుణులు, పిల్లల వైద్యులు సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు పిల్లల ముందు ఏయే పనులను చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చెడు పదాల వాడకం: మీ పిల్లల ముందు చెడు పదాలు ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకండి. మీరు పిల్లల ముందు ఉపయోగించే పదాలు వారి మనస్సులలో లోతుగా పొందుపరచుకుంటాయి. అందువల్ల వారు కూడా ఆ పదాలను ఇతరులపై ఉపయోగించే ప్రమాదం ఉంది.
పిల్లల ముందు గొడవ పడడం: మీ పిల్లల ముందు వాదనలకు దిగకండి. పిల్లల ముందు వాదించడం వల్ల వారి మనశ్శాంతి దెబ్బతింటుంది. ఇంకా మీరు మీ భాగస్వామితో పడే గొడవల కారణంగా పిల్లలు కఠిన హృదయులుగా మారవచ్చు. మనం చేసే ప్రతి పని కూడా వారికి బయటి ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం: పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా లేదా అవమానకరంగా మాట్లాడకండి. ఇలా చేయడం వల్ల పిల్లల మనసులో ఆ వ్యక్తి గురించి తప్పుడు భావనలు, ఆలోచనలు ఏర్పడతాయి.
పిల్లల ముందు మద్యపానం/ధూమపానం: మీ పిల్లల ముందు మద్యం సేవించడం , ధూమపానం అలవాటు చేయడం మానుకోండి. ఎందుకంటే మన పిల్లలు మన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. అంతే కాదు ‘మా నాన్న అలవాట్లు కరెక్ట్’ అని వారు నమ్మవచ్చు. కాబట్టి పిల్లల ముందు చెడు అలవాట్లు పాటించకండి.
ఇతరులతో పోల్చడం: మీ పిల్లలను ఇతరులతో పోల్చడం లేదా మీ పిల్లల ముందు ఇతరుల గురించి మాట్లాడటం తప్పు. ఇలా చేయడం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు. కాబట్టి మీ పిల్లలను అలా పోల్చకండి .ఇది పిల్లల్లో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను కలిగిస్తుంది.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వాడకం : స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, వీడియో గేమ్‌లు వంటి సాంకేతిక పరికరాలను పిల్లల ముందు ఎక్కువగా ఉపయోగించకుండా ఉండండి. ఇలా వాడటం వల్ల వారు ఒంటరిగా ఉన్న అనుభూతికి లోనవుతారు.
రుణం తీసుకోవడం: కుటుంబంలో ఆర్థిక భారం ఉండటం సహజం. ఇక ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి తెలిసిన వారి నుంచి లేదా స్నేహితుల నుంచి డబ్బు అప్పుగా తీసుకుంటారు. అయితే మీ పిల్లల ముందు అలా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది మంచి విషయమని వారు కూడా భావిస్తారు. భవిష్యత్‌లో వారు కూడా అప్పుల మీద బతికేయవచ్చని భావిస్తారు.
భాగస్వామిపై బలప్రయోగం : పిల్లల ముందు మీ భాగస్వామిపై తిట్టకండి లేదా కొట్టకండి. ఎందుకంటే మీ భాగస్వామి పిల్లలకు తల్లి లేదా తండ్రి. మీరు మీ భాగస్వామిని తరచుగా తిట్టినట్లయితే, వారు చెడ్డవారిన మీ బిడ్డ భావిస్తాడు. దీని కారణంగా వారి మధ్య సంబంధం దెబ్బతింటుంది.