
Monsoon Travel Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. హిల్ స్టేషన్స్, ఇతర ప్రాంతాలకు పర్యటనకు వెళ్తుంటారు. అయితే, ఈ టూర్స్ ప్లాన్ చేసే వారు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంతో నిండిన దృశ్యాలు మనసును తేలికపరుస్తాయి. ఆనందాన్ని ఇస్తాయి. అయితే వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేసుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వర్షాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేస్తే.. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. లేదంటే కొండ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. భారీ వర్షాలు పడితే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంటుంది. పిడుగులు, గాలి దుమారంతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

విహారయాత్రలకు వెళ్లే వారు బరువైన వస్తువులను, ఎక్కువ వస్తువులను వెంట తీసుకెళ్లొద్దు. అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లండి. ఆరడానికి ఎక్కువ సమయం పట్టని దుస్తులను ప్యాక్ చేసుకోవాలి. తక్కువ బరువు, సౌకర్యవంతమైన దుస్తులను మాత్రమే ప్యాక్ చేసుకోండి. ఖరీదైన, అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకెళ్లడం అంత సేఫ్ కాదు.

ముఖ్యంగా వర్షాకాలంలో విహార యాత్రలకు వెళ్లే వారు బయటి ఆహారాలు తినడం మానుకోవాలి. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడబడితే అక్కడ నీరు తాగొద్దు. మీ వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి.

గాడ్జెట్‌లను ప్యాక్ చేయడానికి వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు వినియోగించాలి. గాలి చొరబడని జిప్‌లాక్ ప్యాక్‌లను ఉపయోగించాలి. ఇక ట్రెక్కింగ్ ప్లాన్ ఉంటే.. సులభంగా హైకింగ్, ట్రెక్కింగ్ చేయగలిగేందుకు వీలున్న పాదరక్షలను ధరించాలి.