
క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిఏటా దాదాపు 15 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని పలు అధ్యయానాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో 2040 నాటికి క్యాన్సర్ భయంకరమైన రూపం దాల్చుతుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఫలితంగా చాలా మంది చనిపోవచ్చు. అయితే క్యాన్సర్‌ను దూరంగా ఉండడం సాధ్యమేనా..?

జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ పూర్తిగా నివారించబడకపోవచ్చు. కానీ ఈ మార్పులు చేయడం ద్వారా ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. మరి అందుకోసం ఎటువంటి మార్పులు చేయాలో ఇక్కడ చూద్దాం..

క్యాన్సర్‌ను నిరోధించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించుకొని చేసే తేలికపాటి వ్యాయామం, సాధారణ నడక లేదా యోగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.

వీలైనంత వరకు వేయించిన, జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి. వాటిని పూర్తిగా నివారించడం మంచిది. బదులుగా తాజా కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారాలు మొత్తం పెంచండి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మద్యపానం స్థాయిని తగ్గించండి. ధూమపానం వలె మద్యపానం హానికరం కానప్పటికీ.. అధిక మద్యపానం రోగనిరోధక శక్తిని గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఈ అలవాటును ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది.

ధూమపానానికి దూరంగా ఉండండి. అధిక కాలుష్య వాతావరణంలో జీవనం ఇప్పటికే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం ఈ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుంది. క్యాన్సర్‌ను నివారించడంలో అత్యంత ముఖ్యమైన దశ ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులను నివారించడం.

సూర్యరశ్మికి గురికావడం ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అధిక ఎక్స్పోజర్ చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.