
ఇంట్లోకి కావాల్సిన మొత్తం మార్కెట్‌ను ఒక్క రోజులోనే ఖరీదు చేస్తున్నారు. చేపలు, మాంసాహారం నుంచి కూరగాయల వరకు అన్నీ కొంచెం ఎక్కువ పరిమాణంలో కొంటున్నారు. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన ఆహార వస్తువులన్నిటిని వెంటనే వంటగదిలోనో, ఫ్రిజ్‌లోనో నిల్వ చేయాల్సిందే..

కిచెన్‌లో ఏ ఆహార పదార్థాలను ఉంచాలో, ఫ్రిజ్‌లో ఏది ఉంచాలో నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువ మంది పాలు-పెరుగు, వెన్న, చేపలు-మాంసం, కూరగాయలు రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎక్కువ రోజులు ఉపయోగించుకునే విధంగా ఉంటాయి.

పాలు-పెరుగు, చేపలు-మాంసం కాకుండా ఫ్రిజ్‌లో పెట్టుకునే విధముగా అనేక వస్తువులున్నాయి. ఆ ఆహార పదార్ధాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ప్రస్తుతం అందరూ నట్స్ ను ఎక్కువగా తినే ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మార్కెట్ నుండి కాయలు, గింజలను, మొలకెత్తే విత్తనాలు కొనుగోలు చేస్తే.. వాటిని వంటగదిలో ఉంచవద్దు. వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.

ధనియాలు, జీలకర్ర, పసుపు, కారం పొడిని వంటగదిలో పెట్టుకోవాలి. వీటిని రోజువారీ వంటలలో ఉపయోగిస్తారు. అయితే ఒరేగానో, వాము, చిల్లీ ఫ్లేక్స్ వంటి వాటిని రోజు ఉపయోగించరు. కనుక వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. బయట ఉంచితే కొద్ది రోజుల్లో పాడైపోతాయి.

తేనె, మాపుల్ సీరం వంటి పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచండి. సాధారణంగా ఇలాంటి ఆహారం బయట పెట్టుకునే కంటే.. వీటిని గాజు సీసాలలో భద్రపరిచి రిఫ్రిజిరేటర్ లో ఉంచితే చెడిపోయే అవకాశం ఉండదు.

ప్రతి వంటఇంట్లో తప్పని సరిగా ఉండే వస్తువులు రకరకాల పిండ్లు. గోధుమ పిండి, బియ్యం పిండి ఇలాంటి వాటిని సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి. అందువల్ల వీటిని రిఫ్రిజిరేటర్లో ఉంచడం మంచిది. ఇది పిండిని తేమగా ఉంచుతుంది. పురుగులు పట్టే అవకాశం తక్కువ.

ఫ్రిజ్‌లో ఉంచితే వెన్న కరగదు. వెన్న, నెయ్యి , పన్నీర్ వంటి పదార్ధాలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చెడిపోయే అవకాశం ఉంది. కనుక వీటిని ఫ్రిజ్‌లో ఉంచండి.