- Telugu News Photo Gallery Kitchen garden cultivation of garlic and coriander at home roof farming in telugu
Roof Farming: రోజురోజుకీ పెరుగుతున్న ధరల నేపథ్యంలో వెల్లుల్లి, కొత్తిమీరతో సహా ఈ మసాలా దినుసులను ఇంట్లో పెంచుకోండి
ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అని సామాన్యుడు పెరుగుతున్న ధరలతో వాపోతున్నాడు. ఈ నేపథ్యంలో వంటింట్లో ఉపయోగించే కొన్ని వస్తువులను ఇంట్లోనే పెంచుకోండి. వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి వంటి మసాలా దినుసులు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో ఈ మసాలా దినుసులను ఇంట్లో పెంచుకోండి. ఇలా చేయడం వలన డబ్బు ఆదా అవుతుంది.
Updated on: Jul 04, 2023 | 1:50 PM

భారతీయ వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉంది. కొన్ని రకాల మసాలా దినుసులు లేకుండా రుచికరమైన వంటకం తయారు చేయడం వీలుకాదు. జీలకర్ర, కొత్తిమీర, పసుపు, మిరపకాయ, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు, వెల్లుల్లి , జీలకర్ర, మెంతులు వంటి సుగంధ ద్రవ్యాలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. ఈ మసాలాలన్నీ ఆహారాన్ని రుచికరంగా చేయడంతోపాటు ఆయుర్వేద ఔషధంగా పని చేస్తాయి. మీకు కావాలంటే.. మీరు ఈ మసాలా దినుసులను ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు.

పచ్చి మిరపకాయలు లేని కూరను ఊహించలేము. ఏ రకమైన కూరలోనైనా పచ్చి మిరపకాయల వేస్తే ఆ కూర రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా మంది పచ్చి మిరపకాయలను ఆహారంతో పాటు విడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు మిరపకాయలను కొనాలంటే కరెంట్ షాక్ కొడుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. కనుక వీటిని మార్కెట్ లో కొనుగోలు చేయలేరు. ఇలాంటప్పుడు అర్కా మేఘన, కాశీ సుర్ఖ్ పచ్చిమిర్చి రకాలను కుండీల్లో నాటుకోవచ్చు. ఈ రెండు రకాలు రెండు నెలల్లో కాపుకి వస్తాయి.

వెల్లుల్లి చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల జలుబు దరిచేరదు. అలాగే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు వెల్లుల్లి విటమిన్లు సి, కె, నియాసిన్, థయామిన్ , ఫోలేట్ లు అధికంగా ఉంటాయి. వీటి ధర కూడా రోజు రోజుకీ పై పై కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో వీటిని టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు. ట్రేలో మట్టిని నింపి వెల్లుల్లిని విత్తుకోవాలి. 4 నెలల తర్వాత వెల్లుల్లి పంట చేతికి వస్తుంది.

బే ఆకు లేదా బిర్యానీ ఆకులు ప్రతి ఒక్కరి వంటగదిలో కనిపిస్తాయి. బిర్యానీలో మాత్రమే కాదు.. బే ఆకును టీ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ బిర్యానీ ఆకు పెంపకానికి వేసవి కాలంలో అనుకూలం. పెద్ద కుండను తీసుకుని బిర్యానీ ఆకు మొక్కను నాటాలి. ఎప్పుడూ సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఈ బిర్యానీ మొక్కను పెంచుకోవాలి.

కొత్తిమీర .. ఇది కూరకు అదనపు రుచిని అందిస్తుంది. అంతేకాదు ధనియాలతో చేసిన పొడిని కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీర ఆకులతో చేసిన గ్రీన్ చట్నీని ఇష్టంగా తింటారు. ఈ కొత్తిమీరను ఇంట్లోనే పెంచుకోవచ్చు. కుండలలో కొత్తిమీరను విత్తవచ్చు. మధ్యలో నీటిని అందించండి. 15 రోజుల్లో పంట చేతికి వస్తుంది.





























