
శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూత్రపిండాలు శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతుంటారు.

అనారోగ్యకరమైన జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్లు, వేపుడు పదార్థాలను తినే ధోరణి వంటి అలవాట్ల వల్ల మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే, అది శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఇన్‌ఫెక్షన్, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా నేటి కాలంలో అధికమంది కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారు.

కిడ్నీ సమస్యలు ఉన్నాయా? లేదా? అనే విషయాలను కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. తొలుత వెన్ను లేదా నడుం నొప్పి కోసం తనిఖీ చేసుకోవాలి. మూత్రవిసర్జన సమయంలో మంట ఉందో లేదో తనిఖీ చేయాలి. మూత్రంతో పాటు రక్తం లేదా మందపాటి ఎరుపు లేదా ముదురు మెరూన్ రక్తం వస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి.

మూత్ర ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మూత్ర విసర్జన, తరచుగా మూత్రవిసర్జన చేయడం వంటివి కూడా కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు. మూత్రంలో దుర్వాసన.. ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తేలికపాటి జ్వరంతో పాటు, వాంతులు సమస్య ఉన్నా, అది కిడ్నీలో రాళ్ల లక్షణం కావచ్చు.

కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లయితే పక్కటెముకల వెనుక వైపు తీవ్రమైన నొప్పి ఉంటుంది. నొప్పి తగ్గినట్లు అనిపించినా.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. తొలినాళ్లలోనే దీనిని గుర్తించి వైద్యుల సలహా తీసుకోవాలి. నొప్పిని నిర్లక్ష్యం చేస్తే శరీరం ఇతర సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ నొప్పి చాలా రోజులు కొనసాగితే దానిని సాధారణ సమస్యగా కొట్టిపారేయకూడదు. సత్వర చికిత్స ప్రారంభించాలి.