
ఈ వేసవిలో చల్లని పానియాలు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీంతో చాలా మంది ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. వేడిని తగ్గించడానికి, చాలా మంది సాధారణ నీటికి బదులుగా రిఫ్రిజిరేటర్ నుంచి చల్లని నీటిని తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది ఒకేసారి 5 నుంచి 8 బాటిళ్లలో నీళ్లు నింపి, వారాల తరబడి ఫ్రిజ్‌లోనే నిల్వ చేస్తుంటారు.

గతంలో నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది వాడుతున్నప్పటికీ అధిక మంది మాత్రం ఫ్రిజ్ నుంచి నీళ్లు తాగుతున్నారు. సులభంగా చల్లగా మారుతాయని వారాల తరబడి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా? తాగే నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువసేపు నిల్వ చేస్తే ఏమవుతుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో చాలా మంది మట్టి కుండలలో కాకుండా ఫ్రిజ్‌లో నీటిని నిల్వ చేస్తున్నారు. తాగునీటిని ఫ్రిజ్‌లో ఎంతసేపు నిల్వ చేయవచ్చో చాలా మందికి తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తాగునీటిని రిఫ్రిజిరేటర్‌లో 24 గంటలు మాత్రమే ఉంచాలి. 24 గంటలకు మించి నిల్వ చేయవద్దు. అంటే నీటిని మార్చాలన్నమాట.

తాగునీటిని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే, ఆ నీటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందువల్ల బ్యాక్టీరియా కార్యకలాపాలను నివారించడానికి ప్రతి 24 గంటలకు తాగునీటిని మార్చడం మంచిది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేయకుండా ఉండటం కూడా మరీ మంచిది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్రిజ్ నుంచి నీటిని తీసిన వెంటనే తాగకూడదు. దానిలోని చల్లని శాతం తగ్గిన తర్వాతే దానిని తాగాలి. ఆరోగ్యాంగా ఉండాలంటే ఫ్రిజ్‌లోని నీటిని తాగడానికి బదులుగా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచిది.