
ప్రపంచంలోని అగ్రగామి రైల్ సర్వీస్ ప్రొవైడర్లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ లక్షలాది రైళ్లు ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి. భారతీయ రైల్వేలు తన సేవలలో ప్రయాణీకుల ఆనందం, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే సౌకర్యవంతమైన రైలు ప్రయాణంపైనే కాకుండా స్టేషన్‌లో ప్రయాణికులకు మంచి సేవలను అందించడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

అలాంటి ఒక సేవ హోటల్ రూమ్ సర్వీస్. కొన్ని కారణాల వల్ల మీరు రైలును మిస్ అయినప్పుడు లేదా రైలు ఆలస్యమైనా, మీరు భారతీయ రైల్వే పరిధిలోని హోటల్ లాంటి గదిలో బస చేయవచ్చు. కానీ ఇక్కడ ఉండే ఛార్జ్ చాలా తక్కువగా ఉంటుంది. సదుపాయాలు మాత్రం హోటల్‌లో ఉండే విధంగా ఉంటాయి.

కేవలం 50 రూపాయలకే రైల్వే స్టేషన్‌లో హోటల్ లాంటి గదిని పొందవచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా.. ఇది నిజం. ఏసీ, నాన్ ఏసీ గదుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. గది టారిఫ్ మీరు ఉంటున్న రోజుల సంఖ్య లేదా గది రకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 12 గంటల పాటు నాన్-ఏసీ గదిలో ఉండేందుకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

అదే 24 గంటల పాటు AC రూమ్‌లో ఉండటానికి 450 రూపాయలు, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లోని ఏసీ డార్మిటరీలో 12 గంటల బసకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటల బసకు 250 రూపాయలు. డీలక్స్ గదిలో 12 గంటల బసకు 800 రూపాయలు. లక్నోలోని నాన్-ఏసీ డార్మిటరీలో 12 గంటల బసకు కేవలం రూ.50 మాత్రమే.

మరి ఇంత తక్కువలో గదిని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.. ముందుగా మీరు మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మై బుకింగ్ ఆప్షన్‌కి వెళ్లండి. ఇప్పుడు రిటైరింగ్ రూమ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ మీకు కావాల్సిన గదిని బుక్ చేసుకోండి. ఇప్పుడు వ్యక్తిగత సమాచారం, ప్రయాణ సమాచారాన్ని పూరించండి. మీరు డబ్బులు చెల్లించిన తర్వాత మీ గది బుక్ అవుతుంది.