
Indian Oil: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లాభాల్లో దూసుకెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలతో గట్టెక్కింది. దేశంలో అధికంగా లాభాలు పొందిన కంపెనీగా పేరొందింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.7.28 లక్షల కోట్లు (96 బిలియన్ డాలర్లు) ఆదాయం కూడబెట్టుకుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యంత గరిష్ఠంగా ఆదాయం సంపాదించిన భారతీయ కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిలిచింది. IOC అనుబంధ సంస్థలతో కలుపుకొంటే కంపెనీ మొత్తం ఆదాయం రూ.7.36 లక్షల కోట్లు.

గత ఆర్థిక సంవత్సరంలో ఇంతకుముందు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.7.92 లక్షల కోట్ల ఆదాయం సంపాదించినట్లు వెల్లడించింది. అయితే, ఇందులో జీఎస్టీ, ప్రభుత్వం తరపున విక్రయించిన ఉత్పత్తుల మొత్తం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఐఓసీ ఆదాయంలో జీఎస్టీ చెల్లింపులు ఉండవని సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ సందీప్ గుప్తా తెలిపారు.

మార్చినెలతో ముగిసిన గత సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐవోసీ నికర లాభాలు 31.4 శాతం తగ్గాయి. 2020-21 మార్చి త్రైమాసికంలో రూ.8,781.30 (షేర్‌కు రూ.9.56) కోట్ల వస్తే గత మార్చి త్రైమాసికంలో రూ.6,021.88 కోట్లు లాభం వచ్చింది. 2021 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.5,860.80 కోట్ల కంటే ఎక్కువే. 2020-21లో రూ.21,836.04 కోట్లు సంపాదించిన ఐవోసీ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.24.184.10 కోట్ల నికర లాభం సాధించింది.