Hyundai Motor: వినియోగదారులకు షాకిచ్చిన హ్యుందాయ్.. జనవరి నుంచి కార్ల ధరలు పెంపు
కొత్త ఏడాది నుంచి కార్ల ధరల మరింత పెరగనున్నాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, కియా, రెనాల్ట్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీల తరహాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్)..
Updated on: Dec 15, 2022 | 8:19 PM

కొత్త ఏడాది నుంచి కార్ల ధరల మరింత పెరగనున్నాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, కియా, రెనాల్ట్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీల తరహాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సైతం వాహన ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది.

ఈ ధరలు 2023 జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. అన్ని వాహనాలు, మోడల్స్ ధరలను పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే వచ్చే ఏడాదిలో కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకునేవారికి మరింత భారం తప్పదన్నట్లు తెలుస్తోంది.

ఉత్పత్తి వ్యయం, ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే కార్ల ధరల పెంచడం జరుగుతుందని, ఇప్పటివరకూ ఉత్పత్తి వ్యయ భారాన్ని తాము భరించినా జనవరి నుంచి వ్యయాల పెంపు భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని తెలిపింది. అయితే ధరలు ఎంత మేరకు పెరుగుతాయన్న విషయాన్ని హ్యుందాయ్ వెల్లడించలేదు.

ఏ కారుపై ఎంత పెరుగుతుందన్న విషయాన్ని నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హ్యుందాయ్ ఇండియా ప్రస్తుతం దేశీ మార్కెట్‌లో గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ20, ఐ20 ఎన్‌లైన్, కోన ఎలక్ట్రిక్, ఆరా, వెర్నా, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, అల్కాజర్, టక్సన్ కార్లను విక్రయిస్తోంది. గ్లోబల్ ఈవీ, ఐకానిక్ 5ను భారత్ మార్కెట్‌లో లాంఛ్ చేసేందుకు హ్యుందాయ్ సన్నాహాలు చేపట్టింది.




