
సమ్మర్ స్టార్టింగ్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. గత వారం క్రితం అక్కడడక్కడా వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడినా.. భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు. ఈ ఎండా కాలంలో మన శరీంలోని నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, కానీ వాటికంటే కొబ్బరిబొండం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అయితే, ప్రయాణాల్లో రోడ్డు పక్కన కొబ్బరిబొండం కొనేటప్పుడు చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే.. లోపల నీళ్లు తక్కువగా ఉండటం లేదా నాణ్యత లేకపోవడం. మంచి కొబ్బరిబొండాన్ని ఎలా ఎంచుకోవాలో తెలియకపోవడమే దీనికి కారణం. కాబట్టి మేం చెప్పబోయే ఈ చిట్కాలను ఫాలో అయితే మీరు ఎప్పుడూ మంచి కొబ్బరిబొండాన్ని ఎంచుకోవచ్చు.

సైజు, బరువు: మీరు కొబ్బరి బోండా కొనేప్పుడు మొదట బొండం పరిమాణాన్ని, బరువును గమనించండి. పరిమాణానికి తగ్గ బరువు ఉంటేనే దాన్ని తీసుకోండి. ఒకవేళ బొండం పెద్దదిగా ఉండి బరువు తక్కువగా అనిపిస్తే, అది చెట్టునుంచి తెంచి చాలా రోజులైందని అర్థం. అలాంటి వాటిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొనేముందు ఇవిచెక్ చేసుకోండి.

ఊపి చూడటం: బొండాన్ని చెవి దగ్గర పెట్టుకుని ఊపండి. నీళ్లు కదిలే శబ్దం ఎక్కువగా వస్తుంటే అందులో నీళ్లు తక్కువగా ఉన్నాయని అర్థం. ఒకవేళ శబ్దం చాలా తక్కువగా వస్తుంటే, ఆ బొండం నిండా నీళ్లు ఉన్నాయని అర్థం. కానీ చాలా మంది దీన్ని రివర్స్ అర్థం చేసుకుంటారు. అది తప్పు. కాయలో తక్కువ నీరు ఉంటేనే శబ్ధం వస్తుంది.

రంగు: మీకు బాగా నీళ్లు ఉన్న కాయ కావాలి అంటే.. అది మంచి రంగును కలిగి ఉండాలి. అవును తాజా ఆకుపచ్చ రంగు కలిగి ఉన్న బొండాలు సాధారణంగా తాజాగా ఉంటాయి. మీరు వాటి పరిమాణం, బరువును బట్టి తీసుకోవడం మంచిది. ఈ పద్ధతులు పాటిస్తే, మీరు సరైన కొబ్బరిబొండాన్ని ఎంచుకుని ఈ ఎండల్లో హాయిగా దాహం తీర్చుకోవచ్చు.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా మాత్రమే అందించబడింది. దీనిని TV9 దృవీకరించడం లేదు)