
కావలసిన పదార్థాలు: సుమారు ఒకటిన్నర పెద్ద గ్లాసులు నీళ్లు, 4 స్పూన్ల పంచదార, 4 చిన్న స్పూన్ల టీపొడి, 1 చిన్న ముక్క తాజా అల్లం, 10 నుండి 12 తాజా పుదీనా ఆకులు, 10 ప్యాకెట్ పాలపొడి, పాలపొడి కలపడానికి నీళ్లు – అర గ్లాసు

తయారీ విధానం: చిన్న అల్లం ముక్కను తీసుకుని పైన ఉన్న పొట్టును చాకుతో శుభ్రంగా చెక్కుకోవాలి. నీటితో కడిగి రోట్లో కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. సుమారు 10 నుండి 12 తాజా పుదీనా ఆకులను తీసుకుని కాడలు తుంచి నీళ్లలో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.స్టవ్‌పై టీ గిన్నె పెట్టి సుమారు ఒకటిన్నర గ్లాసులు నీళ్లు పోయాలి.

ఇందులో 4 స్పూన్ల పంచదార, 4 చిన్న స్పూన్ల టీపొడి వేసి గరిటెతో తిప్పుతూ నీటిని మరిగించాలి.నీళ్లు మరుగుతూ నురుగు పైకి తేలుతున్నప్పుడు.. దంచి పెట్టుకున్న అల్లం ముక్క, కడిగిన పుదీనా ఆకులను వేయాలి. డికాషన్ సారం నీళ్లలోకి దిగి మంచి ఎరుపు రంగు వచ్చే వరకు మీడియం మంటపై 2 నిమిషాలు తెర్లనివ్వాలి.

డికాషన్ మరిగే లోపల.. వేరొక చిన్న గిన్నెలోకి ₹10 పాలపొడి ప్యాకెట్‌ను పూర్తిగా కట్ చేసి వేయాలి.ఇందులో అర గ్లాసు చల్లటి నీళ్లు పోసి.. స్పూన్‌తో ఉండలు ఏమాత్రం లేకుండా చాలా నునుపైన చిక్కటి పాల ద్రవంలా కలపాలి. బాగా మరుగుతున్న డికాషన్‌లోకి ఉండలు లేని పాలపొడి నీటిని పోయాలి. గిన్నె అడుగున అంటుకున్న పాలపొడి పేస్ట్‌ను కూడా శుభ్రంగా గీకి డికాషన్‌లో వేసేయాలి.

మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో తిప్పుతూ, టీ పైకి లేచేలా 2 నుండి 3 నిమిషాల పాటు రంగు మారి చిక్కబడే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టీ స్ట్రైనర్‌తో గ్లాసుల్లోకి వడపోసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే చిక్కటి 'అల్లం పుదీనా పాలపొడి టీ' సిద్ధం! పైన నురుగుతో, అచ్చం హోటల్ ఇరానీ చాయ్ లాంటి చిక్కదనంతో ఉంటూ.. అల్లం, పుదీనా సువాసనతో గొంతులోకి దిగుతుంటే బడలికంతా మాయమై సరికొత్త ఉత్తేజాన్నిస్తుంది!