
ఒత్తిడితో కూడిన జీవనశైలి, నిద్ర లేకపోవడం, ఆహారంలో అసమతుల్యత, ఇతర అంశాలు నేటి కాలంలో యువత బరువు పెరగడానికి దారితీస్తున్నాయి. అందువల్లనే అవాంఛిత ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే జీవనశైలి, బరువు నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపడం అవసరం. ఇందులో బరువు తగ్గడం మాత్రమే కాదు దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. వేగంగా బరువు తగ్గడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు 7 నుంచి 8 గంటల నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

చక్కెర పానీయాలను పూర్తిగా నివారించాలి. చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది ఇన్సులిన్‌ను పెంచి ఆకలిని అధికం చేస్తుంది. ఫలితంగా బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసుడు నీళ్లు త్రాగడం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీరం కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో అవకాడో, గింజలు, చిక్కుళ్ళు చేర్చుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.