
టేస్ట్: ఆహారాల్లో ఎక్కవుగా కల్తీ అయ్యే పదార్థాలు ఏవైనా ఉన్నాయంటే.. అవి పాల ఉత్పత్తులు మాత్రమే. వీటిలో పన్నీర్ కూడా ఒకటి. అయితే స్వచ్చమైన పనీర్‌ను ఎలా గుర్తించాలి అంటే.. నిజమైన స్వచ్చమైన పనీర్ ఎప్పుడూ మెత్తగా, క్రీమీగా ఉంటూ స్వచ్ఛమైన పాలు వాసన వస్తుంది. ఒక వేళ దానిలో పాల వాసన రుచి రాకపోతే.. అది కల్తీ పనీర్ అని అర్థం. మీరు పనీర్ కొనే ముందు ఈ వాసన, టెక్స్చర్ లేకపోతే దాన్ని తీసుకోకపోవడమే మంచిది.

ప్యాకేజీని చదవండి: మీరు పాలకేంద్రం నుంచి కాకుండా ప్యాకెట్‌లోని పనీర్‌ను కొనాలి అనుకుంటే.. దానిపై ఉండే FSSAI లేబుల్‌ని కచ్చితంగా గమనించండి. ఎందుకంటే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. పనీర్ తయారీలో పాలకు బదులు ఇతర ప్రత్యామ్నాయాలు వాడితే Analogue లేదా Imitation అని ప్యాకెట్‌పై తప్పనిసరిగా రాసి ఉంటుంది. ఒక వేళ ఇవి ఉంటే అది స్వచ్చమైన పాలతో చేసిన పనీర్ కాకపోవచ్చు.

చేతితో నలపడం: మీరు కొన్న పరీర్ స్వచ్చమైనదా కాదా అని తెలుసుకునేందుకు మరో సులభమైన మార్గం ఏమిటంటే.. చేతితో నలిపి చూడడం. ఇందుకోసం మీరు కొద్దిగా పనీర్‌ను చేతితో పట్టుకుని దాన్ని నలిపి చూడండి. ఒక వేళ అది నిలిపిన వెంటనే విరిగిపోతే అది పాల మీగడతో చేసిన స్వచ్చమైన పనీర్ అని అర్థం. అలాకాకుండా ఆది విరగకపోతే.. అది కల్తీ పనీర్ అయి ఉండవచ్చు.

ఐయోడిన్ టింక్చర్ టెస్ట్: పనీర్ స్వచ్చమైందా? లేదా కల్తీదా అని తెలుసుకోవడానికి ఐయోడిన్ టింక్చర్‌ను పరీక్ష కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పనీర్‌ను వేడి నీటిలో కాసేపు ఉడకబెట్టి. చల్లారిన తర్వాత దానిపై కొద్దిగా ఐయోడిన్ టింక్చర్ వేయండి. అప్పుడు పనీర్ రంగు నీలం రంగులోకి మారితే అది కల్తీ పనీర్ అని అర్థం. ఒక వేళ కలర్ మారకపోతే అది అసలైన పనీర్ కావచ్చు.

కందిపప్పు పొడి టెస్ట్: ఈ విధానంలో కల్తీ పనీర్‌ను గుర్తించేందుకు ఉడకబెట్టిన పనీర్ చల్లారాక, అందులో కొద్దిగా కందిపప్పు పొడి వేసి 10 నిమిషాలు ఉంచండి. అది లేత ఎరుపు రంగులోకి మారితే అందులో డిటర్జెంట్ లేదా యూరియా కలిసినట్లు అర్థం. అలాగే మరో విదానంలో పనీర్‌ను ఉడకబెట్టి, చల్లార్చాక సోయాబీన్ పొడి కలపండి. రంగు లేత ఎరుపుగా మారితే అది కూడా డిటర్జెంట్ లేదా యూరియాతో తయారు చేసిన పనీర్ అని అర్థం. కాబట్టి అలాంటి వాటిని ఎప్పుడూ కొనకండి.