
మఖానా కీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శ్రావణ మాసం ఉపవాసం సమయంలో దీనిని తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. కావాల్సిన శక్తిని అందిస్తుంది. అయితే చక్కెర లేకుండా దీనిని చేసుకొని శ్రావణ మాసం ఉపవాసం సమయంలో తినడం వలన ఇది శరీరానికి మరింత బలాన్ని ఇస్తుంది.

మఖానా కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : మఖానా, నెయ్యి, ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష, పాలు, కుంకుమ పువ్వు, బాదం. ఈ కొన్ని పదార్థాలతోనే రుచికరమైన, పోషకాలున్న మఖానా కీర్ తయారు చేసుకోవచ్చును.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మఖానా తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు ఒక ప్యాకెట్ మఖానా తీసుకొని అందులో వేసి, మఖానా కరకరలాడే వరకు వేయిస్తూనే ఉండాలి. మఖానా బాగా వేగితే దాని రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఇవి బాగా వేగిన తర్వాత మఖానాను రెండు భాగాలు చేసుకోవాలి.

కొంత భాగం మఖానా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలన్నింటినీ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా పౌడర్‌లా తయారు చేసుకోవాలి. ఇది కీర్ చాలా రుచిగా ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టాలి. అందులో సరిపడ పాలు, అరలీటర్ పాలు పోయాలి. తర్వాత అందులో ఖర్జూరాలోని విత్తనాలు తీసి వేసి పాలలో వేసి మంచిగా కలపాలి, ఇది వేయడం వలన చక్కెర అవసరం లేదు సహజమైన తీపిని అందిస్తుంది. పాలు బాగా మరిగే సమయంలో కుంకుమపువ్వు వేయాలి.

తర్వాత అందులో ఎండు ద్రాక్ష, వేసి మరో ఐదు నిమిషాల పాటు మరగబెట్టాలి. తర్వాత మఖానా పౌడర్ వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మఖానా గింజలను వేసి మంచిగా కలిపి ఉడకబెట్టుకోవాలి. క్రమంగా ఇది చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్‌లోకి వేసుకోవాలి. పైన బాదం పలుకులు చల్లాలి. అంతే టేస్టీ టేస్టీ చక్కెర లేని మఖానా కీర్ రెడీ.