
Heavy Rain Alert: తెలంగాణతోపాటు.. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఐఎండీ అలర్ట్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ కలెక్టర్లతోపాటు ప్రధాన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. సిబ్బందిని అలర్ట్ గా ఉంచాలని ఆదేశించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

కాగా.. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయుగుండంగా మారే అవశాశం ఉందని.. వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

వానాకాలం మొదలై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. నిన్న మొన్నటి వరకు వర్షాలు పెద్దగా కురవలేదు. ఇప్పుడు సీన్ మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.