మన ఇంటి పెరట్లో, రోడ్డు పక్కన ఎక్కువగా ఉండే బిళ్ల గన్నేరు అందరికీ తెలిసిందే..! వీటిని సతత హరిత పుష్పాలు అని కూడా అంటారు. అలాగే సదాబహార్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలను కుండీల్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత, ఇది ఎక్కువగా పూయడం ప్రారంభిస్తుంది. ఈ పూలను ఎవర్ గ్రీన్ పూలు అని కూడా పిలుస్తారు. ఈ పూలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో కూడా ఈ మొక్కలు ఉండి, పూలు పూస్తున్నట్టయితే..వాటితో అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
సతత హరిత పూలతో ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ఎనిమిది ఎవర్ గ్రీన్ ఫ్లవర్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆ పూల పేస్టును వేసుకుని దానికి ఒక స్పూన్ బాదం ఆయిల్, రెండు స్పూన్ల పచ్చి పాలు, అయిదు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పూర్తిరగా అప్లై చేయాలి. దీన్ని పావుగంట పాటూ ఉంచి తరువాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
మరో పద్ధతిలో సదాబహార్ పూలు, విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక పది పూలను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చిటికెడు పసుపు, విటమిన్ ఇ క్యాప్సూల్, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. సుమారు 20 నుంచి 25 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి రోజ్ వాటర్ ను అప్లై చేయాలి.
ఎవర్‌గ్రీన్ పుష్పాలు, తేనెతో కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఓ పది వరకు ఎవర్ గ్రీన్ పూలను తీసుకుని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటూ అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
అంతేకాదు.. సదాబహర్ పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలో కూడా వినియోగిస్తారు. ఈ పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అలాగే యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా ఎక్కువ. అందుకే చర్మంపై మొటిమలు వచ్చినప్పుడు ఈ పూలను పేస్టులా చేసి అప్లై చేస్తే మంచిది. గాయాలు తగిలిన చోట ఈ పూల పేస్టును రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.