
దుమ్ము, కాలుష్యం, అస్థవ్యస్థ ఆహార అలవాట్లు, హెయిర్ స్టైలింగ్ సాధనాల నుంచి వెలువడే వేడి, రసాయన ఉత్పత్తుల వాడకం.. వంటివాటివల్ల జుట్టు రాలడం, చివర్లు చీలడం వంటి సమస్యలు వెంటాడుతాయి. కలిగిస్తాయి. ఇలాంటి పాడైపోయిన జుట్టుకు సత్వరమే చికిత్స చేయాలి. లేదంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.

కొబ్బరి నూనె చిట్లిన జుట్టును చక్కగా నయం చేస్తుంది. కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రిపేర్ అవుతుంది. దృఢంగా ఉంటుంది. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు పట్టించి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దాదాపు రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరి.

చిట్లిన జుట్టు చివర్లను వదిలించుకోవాలనుకుంటే, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు జుట్టును కత్తిరించవచ్చు. చిట్లిన జుట్టు చివరలను కత్తిరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

చిట్లిన జుట్టుకు చికిత్స చేయడానికి అరటిపండు సహాయపడుతుంది. అరటిపండు హెయిర్ ప్యాక్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందుకోసం పండిన అరటిపండును తీసుకుని బాగా మెత్తగా చేసి, అందులో పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. గంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరి.

బొప్పాయి జుట్టుకు పోషణను అందిస్తుంది. ఇది కోల్పోయిన జుట్టు మెరుపును తిరిగి తీసుకువస్తుంది. అందుకోసం బొప్పాయిని బాగా మెత్తగా చేసి అందులో పెరుగు కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.