శిరోజాల సంరక్షణ కోసం మగువలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కురులు ఒత్తుగా బలంగా పెరగడానికి మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కానీ జుట్టును ఆరోగ్యంగా కాపాడటంలో విటమిన్ ఇ పాత్ర కీలకం అనే విషయం చాలా మందికి తెలియదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ ఇ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శిరోజాల సంరక్షణకు ఎంతో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండటానికి, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది.
విటమిన్ ఇ రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నూనెలు తలకు తేమను అందించి అదనపు నూనె ఉత్పత్తిని నిరోధిస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నూనెలు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.
విటమిన్ ఇ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. షాంపూ, కండీషనర్, హెయిర్ మాస్క్, నూనెలతో విటమిన్ ఇ అందుతుంది. కానీ వాటిని వినియోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. విటమిన్ ఇ ఆయిల్ చర్మంపై అలర్జీలు లేదా దద్దుర్లు కలిగించవచ్చు. దీనిని అతిగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.