
మనం నిత్యం వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే మెంతులు కేవలం వంట దినుసులే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటి ఇతర సుగంధ ద్రవ్యాల మాదిరిగానే మెంతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి చేపల కూరలలో సువాసన కోసం, నిల్వ పచ్చళ్లలో చలదనం కోసం వాడే ఈ మెంతులలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చిన్నగా కనిపించే ఈ గింజల్లో శరీరానికి మేలు చేసే ఎన్నో లాభాలు ఉన్నాయి. మెంతుల గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ B6 పుషక్కలంగా ఉన్నాయి. అలాగే, వీటిలోని ఫైటోకెమికల్స్ అనే సహజ పదార్థాలు వల్ల శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్లను బయటకు పంపడంలో ఇవి సహకరిస్తాయి.

మెంతులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. నానబెట్టిన మెంతులను తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి మెంతులు మంచి పరిష్కారం. దీనిద్వారా జీర్ణక్రియ మరింత మెరుగుపడుతుంది. జలుబు లేదా ఒంటి నొప్పులు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో మెంతులు కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. మెంతులు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు ఎంతగానో తోడ్పడతాయి.

మెంతులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో మెంతులను చేర్చడం ద్వారా దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు.

నిత్యం మెంతులు తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పికి గోరువెచ్చని నీటిలో మెంతులు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా, మెంతులు కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మెంతులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులను ఆహార పదార్థాల్లో ఉపయోగించడంతోపాటు.. మెంతులను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు..