
పొట్టలో ఉన్న గ్యాస్ బయటకు పంపడం అనేది మనం తరచుగా చేసే పనే.. అయితే దీన్ని బహిరంగంగా చర్చించడానికి చాలామంది ఇబ్బందిపడే ఒక అంశం. అయితే, ఇది శరీరానికి అత్యంత సహజమైన ప్రక్రియ అని, దీనిని బయటకు పంపకుండా అణచివేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పిత్తులు రావడం అనేది మూత్రవిసర్జన, మలవిసర్జన, చెమట పట్టడం లాంటి ఒక సాధారణ శారీరక ప్రక్రియ. చాలామంది సమాజంలో సిగ్గుపడి దీనిని ఆపుకుంటారు. కానీ అలా ఆపుకోవడం వలన శరీరంలో గ్యాస్ పేరుకుపోతుందని, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుందని, పెథలాజికల్ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యకరమైన గట్ కోసం గ్యాస్ సాధారణంగా బయటకు వెళ్లడం చాలా ముఖ్యం. సర్జరీ తర్వాత కూడా డాక్టర్లు పేషెంట్లను గ్యాస్ బయటకు పోతుందా అని అడుగుతారు. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు సంకేతమట. అధికంగా లేదా దుర్వాసనతో కూడిన గ్యాస్ రావడం అనేది అనారోగ్యాన్ని సంకేతంగా సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు, ముఖ్యంగా అధిక ప్రోటీన్, అధిక కొవ్వు పదార్థాలు, లేదా తక్కువ పీచు పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది.

పేగులలో ఆహారం ఎక్కువసేపు నిలిచిపోవడం వలన బ్యాక్టీరియా దానిని విచ్ఛిన్నం చేసి దుర్వాసనతో కూడిన గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులలో మలం నిలిచిపోవడానికి, సరిగా శుభ్రం కాకపోవడానికి సంకేతం. సాధారణ గ్యాస్ బయటకు పంపడం ద్వారా ఎటువంటి దుర్వాసన ఉండదు. రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి మలవిసర్జన చేయడం సాధారణం. అయితే రెండు రోజులకు మించి సమయం తీసుకుంటే లేదా మలవిసర్జన కోసం ఐదు నిమిషాలకు మించి ప్రయత్నిస్తే దాన్ని మలబద్ధకం అంటారు.

భోజనం చేసిన వెంటనే మలవిసర్జనకు వెళ్లడం అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) లక్షణం కావచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది చిన్నపిల్లలలో పాలు తాగిన వెంటనే మలవిసర్జన చేసే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ లాంటిదని, పెద్దలలో ఇది ఒత్తిడి, ఆందోళన, తక్కువ శారీరక శ్రమ వంటి వాటి వల్ల వస్తుందట. ఐబీఎస్ అనేది మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చే సమస్య అని, పరీక్షలలో సాధారణంగా ఎటువంటి లోపాలు కనిపించవని, దీనికి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడమే ప్రధాన పరిష్కారమట.