ఎండు ద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి, జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, ఎముకలు బలంగా మారుతాయి. ఇలా చెప్పుకుంటే వీటివల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. అయితే అతి ఎప్పుడూ అనర్థానికే దారి తీస్తుందన్నట్లు ఎండు ద్రాక్షవల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అతిగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కిస్మిస్‌లను అతిగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే వాటిని ఎక్కువగా తినడం వల్ల ఇతర పోషకాల శాతం తగ్గుతుంది.
ఎక్కువ నీరు తీసుకోకుండా ఎండుద్రాక్ష ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, అజీర్ణం, ఇతర రుగ్మతలు ఏర్పడవచ్చు. ఎండు ద్రాక్ష అంటే సహజంగానే తీపి పదార్థం. అధిక చక్కెర, కేలరీలు ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్‌తో బాధపడేవారు ఎండుద్రాక్షను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు బరువు తగ్గే ప్రయాణంలో ఉంటే, మీరు దానిని తీసుకోకపోవడం మేలు. ఒక వేళ తీసుకోవాల్సి వచ్చినా మితంగా తీసుకోవడం మంచిది.
ఎండు ద్రాక్షలో పాలీఫెనాల్స్, బయోఫ్లేవనాయిడ్స్ మరియు ఫైటోన్యూట్రియెంట్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఎండుద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టం జరగవచ్చు.