
ఏలూరు : సాధారణంగా చూస్తే అదో చిన్న అగ్గిపుల్ల.. ఒక్కసారి గీసి పారేసే నిప్పు పుల్ల. కానీ, అదే అగ్గిపుల్ల ఏలూరుకు చెందిన ఓ సామాన్య కళాకారుడి చేతుల్లోకి వెళ్తే అపురూప కళాఖండంగా రూపాంతరం చెందుతుంది. కంటికి కనిపించీ కనిపించని సూక్ష్మ కళా నైపుణ్యంతో అగ్గిపుల్ల చివరలనే కాన్వాస్‌గా, శిల్ప కళావేదికగా మలుస్తూ అబ్బురపరుస్తున్నారు ఏలూరు గన్‌బజార్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మేతర్ సురేష్ బాబు.

పేదరికం అడ్డుగోడలు నిర్మించినా, ఆటో చక్రాలు తిప్పుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా.. కళపై ఉన్న అపారమైన తపన ఆయనను జాతీయ స్థాయి రికార్డుల దాకా తీసుకెళ్లింది. వన్‌టౌన్ పరిధిలోని గన్ బజార్‌లో నివాసముంటున్న మేతర్ సురేష్ బాబు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. బస్టాండ్ నుంచి నిత్యం ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే, ఆయన హృదయంలో మాత్రం కళాతృష్ణ నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. గత 26 సంవత్సరాలుగా ఆయన అగ్గిపుల్లలపై శిల్పాలు చెక్కడం, చిత్రాలు గీయడం అనే అరుదైన మైక్రో ఆర్ట్ సాధన చేస్తున్నారు. ప్రతిరోజూ ఆటో తోలి అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత, రాత్రి వేళల్లో గంటల కొద్దీ ఏకాగ్రతతో కూర్చొని అగ్గిపుల్లలపై ప్రాణం పోస్తున్నారు.

ఒక చిన్న అగ్గిపుల్లపై ఒక రూపాన్ని తీర్చిదిద్దడమంటే అత్యంత క్లిష్టమైన విషయం. కొద్దిపాటి తేడా వచ్చినా పుల్ల విరిగిపోతుంది లేదా రూపం దెబ్బతింటుంది. అలాంటిది సురేష్ బాబు ఎంతో ఓర్పుతో, నిశిత దృష్టితో దేశ విదేశ ప్రముఖుల రూపాలను, చారిత్రక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిమలను అగ్గిపుల్లలపై ఎంతో సజీవంగా తీర్చిదిద్దారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన డబుల్ సెంచరీ (200 పరుగులు) రికార్డు సందర్భంగా సచిన్ రూపాన్ని, హాకీ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కళాకృతులను మలిచారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించిన సందర్భంగా.. అగ్గిపుల్లలపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల డ్యాన్స్ మూమెంట్స్‌ను అచ్చం అలాగే చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా అగ్గిపుల్లలపై భారత జాతీయ పతాకాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించి దేశభక్తిని చాటుకున్నారు. శ్రీరాముడి రూపం, రామాయణంలోని వనవాస ఘట్టాలు, తాజ్ మహల్, చార్మినార్, కుతుబ్ మినార్, అలాగే అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వంటి కట్టడాల సూక్ష్మ రూపాలను అగ్గిపుల్లలపై ఆవిష్కరించారు.

‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కైవసం.. గిన్నిస్ బుక్ లక్ష్యం!..సురేష్ బాబు సాధించిన ఈ అరుదైన ప్రతిభకు గుర్తింపుగా ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం లభించింది. పలు అవార్డులు, ప్రశంసలు ఆయన ఖాతాలో చేరాయి. అయితే ఆయన ఆశయం ఇంతటితో ఆగలేదు. భవిష్యత్తులో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో భారతదేశం తరఫున, ఏలూరు ఖ్యాతిని ప్రపంచ పటంపై నిలబెట్టడమే తన జీవిత లక్ష్యమని సురేష్ ధీమాగా చెబుతున్నారు.