
కార్బోహైడ్రేట్లు, కేలరీల భారం: అన్నం, చపాతీ రెండింటిలోనూ పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. రెండింటినీ ఒకేసారి తిన్నప్పుడు శరీరానికి అవసరానికి మించిన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ఈ అదనపు గ్లూకోజ్‌ను శరీరం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది, దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.

రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుదల: అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. చపాతీలో ఫైబర్ ఉన్నప్పటికీ, రెండింటినీ కలిపి పెద్ద మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ అలవాటుకు దూరంగా ఉండటం చాలా అవసరం.

జీర్ణక్రియపై ప్రభావం: రైస్ త్వరగా జీర్ణమవుతుంది. కానీ, గోధుమలతో చేసే చపాతీ జీర్ణమవ్వడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటి జీర్ణమయ్యే వేగం వేర్వేరుగా ఉండటం వల్ల కొందరిలో జీర్ణక్రియ మందగించి గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

బరువు పెరిగే అవకాశం: రెండు రకాల ధాన్యాలను ఒకేసారి తినడం వల్ల కేలరీల వినియోగం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్ ఈటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి అనుకున్న ఫలితాలు రావు. కాబట్టి, ఒకే పూటలో అన్నం లేదా చపాతీ... ఏదో ఒక దాన్ని మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోవడం మంచిది.

మీ భోజనం ప్లేట్‌లో సగం భాగం తాజా కూరగాయలు లేదా సలాడ్స్, పావు భాగం ప్రొటీన్ పప్పు, పనీర్, గుడ్లు, మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రెండూ తినాలనిపిస్తే, ఒక చిన్న చపాతీతో పాటు చాలా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకుంటూ, కూరలు ఎక్కువ మోతాదులో తినడం శ్రేయస్కరం.