
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ మైసూర్ పాక్ ఇష్టంగా తింటారు. అంతే కాకుండా, ఇంటిలో ఏ చిన్న శుభకార్యం అయినా సరే తప్పకుండా మైసూర్ పాక్ ఉండాల్సిందే. ప్రతి చిన్న చిన్న ఈవెంట్‌లో కూడా ఈ స్వీట్ ఉంటుంది. అయితే అందరూ మెచ్చే టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : శనగ పిండి ఒక కప్పు, పంచదార రెండు కప్పులు, నెయ్యి కప్పు, నూనె , యాలకుల పొడి. ఈ పదార్థాలతో ఇంటిలోనే చాల సులభంగా , మైసూర్ పాక్ తయారు చేసుకోవచ్చును. కాగా, ఇప్పుడు మనం మైసూర్ పాక్ తయారీ విధానంలోకి వెళ్దాం.

దీని కోసం ముందుగా చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ముందుగా మీరు మైసూర్ పాక్ తయారు చేయాలి అనుకుంటే, శనగ పిండిని తీసుకోండి. దీనిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొలతల ప్రకారం నూనె , నెయ్యి తీసుకోండి. ఎప్పుడూ కూడా కొలతలు సరిసమానంగా ఉన్నప్పుడే ఏ వంటకమైనా టేస్టీగా వస్తుంది.

మైసూర్ పాక్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టండి. అందులో నూనె, నెయ్యి వేసి బాగా కలిసేలా మరగబెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు మరో వైపు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పాకం బాగా మందంగా కాకుండా, కాస్త తీగ పాకం వచ్చేలా చూసుకోండి. తీగ పాకం వచ్చిన వెంటనే అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో శనగపిండి వేసి గట్టిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

ఇప్పుడు నూనె, నెయ్యి వేడి చేసే స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం కొంచెం తీసుకుంటూ, శనగపిండి , చక్కెర పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేయగానే పిండి విడిపోతూ కనిపిస్తుంది. ఇలా అయిన వెంటనే ఒక ప్లేట్ తీసుకొని దానికి నూనె రాయలి. తర్వాత శనగపిండి, చక్కెర పాకం మిశ్రమం ప్లేట్‌లో వేసి మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.