
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌లో కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. భారీ స్కోర్‌ను సాధించాలని కర్ణాటక జట్టు టార్గెట్ చేసినప్పటికీ.. ఆ విధ్వంసాన్ని చివరి ఓవర్‌లో విదర్భ ఫాస్ట్ బౌలర్ అడ్డుకున్నాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ ఫాస్ట్ బౌలర్ దర్శన్ నల్కండే హ్యాట్రిక్ సాధించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

దర్శన్ నలకండే ఆఖరి ఓవర్‌లో అనిరుధ్ జోషి, బిఆర్ శరత్‌లను వరుస బంతుల్లో అవుట్ చేయగా, ఆ తర్వాత జగదీష్ సుచిత్ వికెట్ పడగొట్టి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అంతేకాదు నాలుగో బంతికి అభినవ్ మనోహర్ వికెట్‌ను తీసి.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దర్శన్ నల్కండే తన చివరి ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి నలుగురు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించాడు.

రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన దర్శన్ నల్కండే ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే తుది జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. నల్కండే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దర్శన్ నల్కండే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నల్కండే కేవలం 9 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. ఇది T20ల్లో అతడి అత్యుత్తమ గణాంకాలు.