సుమారు 12 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మరోసారి ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుండగా, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సంయుక్తంగా ప్రపంచకప్ టోర్నీని నిర్వహించారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. 49వ ఓవర్‌లో ధోనీ బాదిన సిక్స్‌తో భారత్‌ను ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్ నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అజేయంగా 93 పరుగులు చేశాడు. చివర్లో నువాన్ కులశేకర్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిచాడు. భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఈ సిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
కాగా ధోని కొట్టిన సిక్స్ బంతి పడిన రెండు సీట్లను వేలం వేయనుంది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ). 'ధోనీ తనదైన స్టైల్లో ముగించాడు.. ఈ చారిత్రాత్మక క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఆ బంతి పడిన వాంఖడే స్టేడియంలోని రెండు సీట్లను ఎంసీఏ వేలం వేస్తోంది'అని ట్వీట్ చేసింది ఎంసీఏ.
మరి మీరు మహేంద్ర సింగ్ ధోనీ అభిమాని అయితే మీరు కూడా ఈ సీట్లను వేలం చేసుకోవచ్చని ఎంసీఏ తెలిపింది. వేలం ద్వారా వచ్చే ఆదాయం వర్ధమాన అథ్లెట్లకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సిక్సర్లు కొట్టిన ప్రదేశంలో స్మారక చిహ్నాన్ని ఎంసీఏ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని సన్మానించారు.