TNPL 2023: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో నెల్లై రాయల్ కింగ్స్ కెప్టెన్ అరుణ్ కార్తీక్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన చెపాక్ సూపర్ గిల్లీస్ కెప్టెన్ జగదీశన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ప్రదోష్ పాల్ (2), ఎన్ జగదీశన్ (15) ఆరంభంలోనే వికెట్లను సమర్పించుకున్నారు. ఈ సమయంలో మూడో స్థానంలో వచ్చిన అపరాజిత్ జట్టుకు ఆసరాగా నిలిచాడు.
ఆరంభంలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన అపరాజిత్ ఆ తర్వాత రన్ రేట్ పెంచడం మొదలుపెట్టాడు. 5 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో ఉగ్రరూపం ప్రదర్శించారు. తన బ్యాట్‌ను ఝుళిపించి 51 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అపరాజిత్ హాఫ్ సెంచరీతో చెపాక్ సూపర్ గిల్లీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లై రాయల్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ అరుణ్ కార్తీక్ శుభారంభం అందించాడు. తొలి ఓవర్ నుండే మెరుపు బ్యాటింగ్ చేశాడు. చెపాక్ టీమ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అరుణ్ కార్తీక్ 10 ఫోర్లు, 4 సిక్సర్లలతో దడదడలాడించాడు. జట్టు విజయానికి 5 పరుగులు కావాల్సి ఉండగా భారీ సిక్సర్ కొట్టి అటు జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు.. తన సెంచరీని పూర్తి చేశాడు. ఇలా 61 బంతుల్లోనే అరుణ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు.
అరుణ్ కార్తీక్ సెంచరీ ఇన్నింగ్స్‌తో నెల్లై రాయల్ కింగ్స్ 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో చెపాక్ సూపర్ గిల్లీస్‌పై ఘన విజయం సాధించింది.
ఇక సెంచరీ సీడీసీలో మెరిసిన అరుణ్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.