
టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన ప్రియురాలితో కలిసి ఘనంగా పెళ్లి పీటలెక్కాడు. ఈ శుభవార్తను సైనీనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

తన పెళ్లి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన సైనీ.. ' నా చిరకాల స్నేహితురాలు స్వాతి ఆస్థానాను పెళ్లి చేసుకున్నాను. మా జీవితంలో కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించాం. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమను కోరుకుంటున్నాం' అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు.

సైనీ- స్వాతిల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమిండియా క్రికెటర్లతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ తెవాటియా, సాయికిషోర్, చేతన్ సకారియా, మన్‌దీప్ సింగ్, మొహ్సిన్ ఖాన్ తదితర భారత క్రికెటర్లు నవదీప్- స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

టీమిండియా తరఫున సైనీ 11 టీ20లు, 8 వన్డేలు, 2 టెస్టులు ఆడాడు. అలాగే ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.

ఇక నవదీప్ భార్య స్వాతి ఆస్తానా ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ వ్లాగర్. ఆమెకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 84 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.