డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మూడో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్.. టీమిండియాపై 444 పరుగుల ఆధిక్యం వద్ద తన ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. దీంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.
అయితే అంతకముందు ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రోహిత్ పేరిట ఉమ్మడిగా ఉండేది. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సిక్సర్ కొట్టడం ద్వారా రోహిత్ ఆ స్థానాన్న పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు 69 సిక్సర్లు కొట్టడానికి సచిన్ మొత్తం 329 టెస్ట్ ఇన్నింగ్స్ తీసుకోగా.. రోహిత్ కేవలం 85 ఇన్సింగ్స్‌ల్లోనే 70 సిక్సర్లు బాదడం విశేషం.
కాగా, టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ 91 సిక్సర్లు బాది ఈ రికార్డు సృష్టించాడు.
అలాగే రెండో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. మొత్తం 144 టెస్ట్ ఇన్సింగ్స్ ఆడిన ధోని 78 సిక్సర్లు బాదాడు.
డబ్య్లూటీసీ ఫైనల్ ఆడుతున్న రోహిత్ తాజా సిక్సర్ ద్వారా మొత్తం 70 సిక్సర్లతో మూడో స్థానంలోకి ఎగబాకాడు.
మూడో స్థానం పూర్తిగా రోహిత్ వశం కావడంతో.. టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ క్రికెట్ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నాలుగో స్థానంలోకి దిగాడు సచిన్.
ఇంకా ఈ జాబితా 5వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఉన్నాడు. మొత్తం 184 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కపిల్ 61 సిక్సర్లు కొట్టాడు.