Jos Buttler: ఒక్క సెంచరీతో రికార్డులే రికార్డులు.. ఐపీఎల్‌లో జోస్ బట్లర్ సరికొత్త చరిత్ర..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 19వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆర్‌సీబీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Updated on: Apr 07, 2024 | 10:05 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 19వ మ్యాచ్‌లో జోస్ బట్లర్ (Jos Buttler) ఆర్‌సీబీపై భారీ సెంచరీ సాధించి ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్టార్టర్ గా రంగంలోకి దిగిన బట్లర్ 58 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు.

ఈ అద్భుతమైన సెంచరీతో జోస్ బట్లర్ IPL చరిత్రలో 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి విదేశీ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన 2వ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2022లో ఈ ఘనత సాధించాడు.

ఈ సెంచరీ ప్రదర్శనతో జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు అజింక్యా రహానే (10 సార్లు) పేరిట ఉండేది. ఇప్పుడు 11వ సారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకుని రాజస్థాన్ రాయల్స్‌కు బట్లర్ కొత్త చరిత్ర సృష్టించాడు.

అలాగే ఐపీఎల్ 100వ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు జోస్ బట్లర్ పేరు మీద చేరింది. 2022లో 60 బంతుల్లో కేఎల్ రాహుల్ 58 బంతుల్లోనే జోస్ బట్లర్ బద్దలు కొట్టడం విశేషం.

ఈ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సంజూ శాంసన్ (3389) అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు జోస్ బట్లర్ (2831) అజింక్యా రహానె (2810)ను అధిగమించాడు.

100వ మ్యాచ్ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. అలాగే క్రిస్ గేల్ (6 సెంచరీలు) రికార్డును సమం చేయడం విశేషం. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా, జోస్ బట్లర్ (6 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు.

ఓవరాల్‌గా జోస్ బట్లర్ అద్భుత సెంచరీతో ఎన్నో రికార్డులను లిఖించగా, ఈ రికార్డుతో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని అందించడంలో సఫలం కావడం విశేషం.





























