- Telugu News Photo Gallery Cricket photos IPL 2023, LSG vs GT: KL Rahul Breaks Virat Kohli's T20 Record and becomes fastest player to Compete 7000 Runs for India
IPL 2023: కింగ్ కోహ్లీ ‘టీ20 రికార్డు’ బద్దలు.. చరిత్రను తిరగరాసిన కేఎల్ రాహుల్.. ఆ లిస్టులో అగ్రస్థానంలోకి..
లక్నో, గుజరాత్ జట్ల మధ్య శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 68 పరుగులు చేశాడు. తద్వారా భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో కింగ్ కోహ్లీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు రాహుల్.
Updated on: Apr 23, 2023 | 9:10 AM

ఐపీఎల్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్‌లో చేరడంతో పాటు.. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

మహ్మద్ షమీ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన రాహుల్ టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 5వ క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ అవతరించాడు. అంతేకాక టీమిండియా తరఫున అత్యంత వేగంగా 7000 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.

నిజానికి ఈ రికార్డ్ అంతక ముందు కింగ్ కోహ్లీ పేరిట ఉండేది. అయితే 197 టీ20 ఇన్నింగ్స్‌లలోనే 7 వేల పరుగులు బాదడం ద్వారా ఆ రికార్డును తన వశం చేసుకన్నాడు కేఎల్ రాహుల్. మరి భారత్ తరఫున అత్యంత వేగంగా 7 వేల టీ20 పరుగులు చేసిన జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో 7000 పరుగులు(మొత్తం 7054) మార్క్ అందుకున్నాడు. కోహ్లీ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించడం ద్వారా మొదటి స్థానంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. రాహుల్‌కి ఈ ఫార్మాట్‌లో 6 సెంచరీలు, 61 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.

ఇండియన్ ‘రన్ మెషిన్’గా పేరున్న విరాట్ కోహ్లీ 212 టీ20 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలా భారత్ తరఫున అత్యంత వేగంగా 7000 టీ20 పరుగులు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు.

భారత్ తరఫున అత్యంత వేగంగా 7 వేల టీ20 పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. గబ్బర్ ఈ ఘనతను సాధించడానికి 246 టీ20 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

సురేష్ రైనా కూడా ఈ లిస్టులో ఉన్నాడు. 251 టీ20 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు చేయడం ద్వారా 4 స్థానంలో ఉన్నాడు ఈ ‘మిస్టర్ ఐపీఎల్’

అలాగే భారత్ తరఫున అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో రోహిత్ శర్మ 5వ స్థానంలో ఉన్నాడు. 7000 మార్క్ అందుకోవడానికి హిట్ మ్యాన్ 258 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.





























