- Telugu News Photo Gallery Cricket photos IPL 2021: Top 5 batsmen with highest individual scores in IPL History Telugu Cricket News
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసింది వీరే.. లిస్టులో ఇద్దరు భారతీయులు.. ఎవరో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో అనేక సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే పెద్ద ఇన్నింగ్స్‌గా మారాయి. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు కాకుండా మరికొందరు కూడా ఈ భారీ ఇన్నింగ్స్‌లో భాగమయ్యారు.
Updated on: Sep 16, 2021 | 7:11 AM

IPL 2021: ఐపీఎల్ రెండో దశ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధమైన టీ20 లీగ్ మరోసారి యూఏఈలో జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వర్సెస్ ముంబై మ్యాచుతో ఈ పోటీలు మొదలుకానున్నాయి. అయితే, ఈ టోర్నమెంట్‌లో చాలా పెద్ద స్కోర్లు తరచుగా కనిపిస్తున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో భారీ వ్యక్తిగత స్కోర్‌లు చేసిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటి పేరు దిగ్గజ వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, తుఫాన్ ఇన్నింగ్స్‌కు మారుపేరుగా ఈ బ్యాట్స్‌మెన్ పేరుగాంచాడు. 23 ఏప్రిల్ 2013 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ స్కోర్ నమోదు చేశాడు. సహారా పుణె వారియర్స్‌పై కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. గేల్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో రికార్డు సృష్టించాడు.

ఈ టోర్నమెంట్ చరిత్రలో రెండవ స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్. ఈ బ్యాట్స్‌మెన్ 158 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 18 ఏప్రిల్ 2008 న ఐపీఎల్ చరిత్రలో మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీకి వ్యతిరేకంగా ఈ సంచలన ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున మెక్‌కల్లమ్ గొప్ప అరంగేట్రం చేశాడు. మెక్‌కల్లమ్ 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.

మూడవ స్థానంలో మరొక లెజెండరీ బ్యాట్స్‌మెన్ ఆర్‌సీబీ తరుపున ఈ స్కోర్ నమోదు చేశాడు. 10 మే 2015 న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏబీడీ కేవలం 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 పరుగులు బాదేశాడు. అతను విరాట్ కోహ్లీ (82) తో కలిసి 215 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు.

ఈ జాబితాలో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. 2020 సీజన్‌లో దుబాయ్‌లో ఆర్‌సీబీకి వ్యతిరేకంగా రాహుల్ 128 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కేవలం 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 132 పరుగులు చేశాడు.

ఇక ఐదో స్థానంలో మరో భారత బ్యాట్స్‌మెన్ నిలిచాడు. రిషబ్ పంత్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఈ యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ 128 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 15 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీలో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 2018 మే 10 న ఈ స్కోర్ నమోదు చేశాడు. అయితే ఈ మ్యాచులో ఢిల్లీ జట్టు ఓడిపోవడం గమనార్హం. ఎందుకంటే శిఖర్ ధావన్ ఎస్‌ఆర్‌హెచ్ తరపున 92 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.





























