
HBD Sanath Jayasuriya: ప్రపంచంలో వేగంగా పరుగులు సాధించే బ్యాట్స్ మెన్లలో సనత్ జయసూర్య పేరు కచ్చితంగా ఉంటుంది. పరిమిత ఓవర్లలో ఓపెనింగ్ బ్యాటింగ్ స్వరూపాన్ని మార్చిన ఘనత జయసూర్యకు దక్కుతుంది. నేడు శ్రీలంక మాజీ కెప్టెన్, గొప్ప బ్యాట్స్ మెన్లలో ఒకరైన సనత్ జయసూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

29 అక్టోబర్ 2000లో షార్జాలో ఇండియా, శ్రీలంక టీం ల మధ్య ఓ మ్యాచ్.. టీమిండియాకు ఓ చేదు ఘటనను మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 54 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది వన్డేల్లో భారత్ అత్యల్ప స్కోరుగా నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్లకు 299 పరుగులు సాధించింది. జయసూర్య 161 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. ఇందులో 21 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ ల మధ్య సింగపూర్‌లో జరిగిన ట్రై-సిరీస్ లో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో జయసూర్య కేవలం 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 65 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 349 పరుగులు చేసింది. పాకిస్థాన్‌పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లో కూడా జయసూర్య చాలా రికార్డులు సృష్టించాడు. ఇండియాతో 1997 లో కొలంబోలో జరిగిన ఓ టెస్టులో భారత్ 8 వికెట్లకు 537 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జయసూర్య 340 పరుగులు సాధించాడు.

శ్రీలంక 1996 లో తొలిసారిగా ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ ప్రపంచ కప్‌లో జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.