
టీ20 ప్రపంచ కప్ 2026లో ఐదవ మ్యాచ్ నేపాల్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ తన పేరిట కొత్త రికార్డ్ లిఖించుకున్నాడు.

నేపాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 17 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెట్ లెజెండ్ మహేల జయవర్ధనేను అధిగమించాడు.

మహేల జయవర్ధనే తన కెరీర్‌లో మొత్తంలో 31 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ ఇప్పుడు 36 మ్యాచ్‌ల్లో 1039 పరుగులు చేసి, మూడో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముందున్నారు.

విరాట్ కోహ్లీ 35 మ్యాచ్‌ల్లో 1,292 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 47 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో 1,220 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అందువల్ల, జోస్ బట్లర్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం చాలా ఎక్కువ.

రాబోయే మ్యాచ్‌లలో జోస్ బట్లర్ 234 పరుగులు చేస్తే, అతను రోహిత్ శర్మను అధిగమించి టాప్ 2లో చేరుతాడు. అయితే, విరాట్ కోహ్లీని అధిగమించాలంటే, అతను 254 పరుగులు చేయాల్సి ఉంది. అది బట్లర్‌కు అంత సులభం కాదు.