
సఖినేటిపల్లి, నవంబర్ 7: తనకు సపర్యలు చేసే యజమాని చనిపోవడంతో మృతదేహం వద్ద విలపించి, విచారం వ్యక్తం చేసి ప్రేమను చాటుకుందా గోవు. యజమాని చనిపోవడంతో మృతదేహం వద్ద ఆవేదనతో అరుస్తూ దుఃఖం వెళ్లగక్కింది. ఆవు అరుపులు చూసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో పోతురాజు సత్యనారాయణమూర్తి అనే అతను గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకునే ఆవు తనకు తానే స్వయంగా పొలం నుండి యజమాని సత్యనారాయణమూర్తి మృతదేహం దగ్గరికి వచ్చి సుమారుగా అర్ధగంట పాటు యజమాని మృతదేహం వద్దే గట్టిగా అరుస్తూ విచారం వ్యక్తం చేయడం కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీటి పర్యంతం చేసింది.

నేటి సమాజంలో మనుషులకు లేని ప్రేమ మూగజీవైన ఆవు తన యజమానిపై చూపిన ప్రేమను స్థానికులు కొనియాడుతున్నారు.

ఆవు పుట్టినప్పటి నుండి యజమాని సత్యనారాయణ మూర్తి కన్న బిడ్డ వలె తన చేతులతో పెంచి ఆలనా పాలన చూడడం వల్లనే రెండు రోజులు నుండి విచారంగా ఉంటుందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.