ఆయనకున్న ఇమేజ్ ఏమో రౌడీ బోయ్. కానీ ఆయనకున్న జబర్దస్త్ హిట్లన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయినవే. సిక్స్ ఫీట్లకు పైగా ఎత్తున్న విజయ్ దేవరకొండ పక్కింటి అబ్బాయి పాత్రల్లో కనిపిస్తే స్క్రీన్ ని ఇంకో సారి చూడాలనేంత ముచ్చటగా ఉంటుంది. అలా ముచ్చటపడిపోయి ఫ్యామిలీ ఆడియన్స్ ఖుషీగా థియేటర్ల వైపు అడుగులేస్తున్నారు. ఖుషీ మూవీకి కాసుల పంట పండిస్తున్నారు.
ఖుషి సినిమాకు థియేటర్లలో ఫ్యామిలీల సందడి కనిపిస్తోంది. ఖుషి కలెక్షన్లు చూసుకుని నిర్మాతల గుండెల్లో సందడి మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన సినిమా ఖుషి. రిలీజ్ అయిన ఫస్ట్ డే 16 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అలాగని విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీస్ ఏమైనా బంపర్ హిట్సా అంటే.. కాదు.
ఒకటికి మూడు సినిమాల ఫ్లాపుల తర్వాత వచ్చిన హిట్ ఇది. లైగర్ తర్వాత విజయ్ పరిస్థితి ఏంటని అంతా అనుకుంటున్న టైమ్‌లో, ఆయన్ని సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారని ప్రూవ్ చేసిన సినిమా ఖుషి.
మనుషుల మధ్య ఉంటే ఈగోలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాల గురించి సెన్సిబుల్ స్టోరీలు రాసుకుంటారు డైరక్టర్ శివ నిర్వాణ. ఆయన రాసుకున్న కథతో డైరక్ట్ చేసిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది.
మణిరత్నం రెఫరెన్సులు, కశ్మీర్ అందాలు, సినిమా రిలీజ్‌కి ముందే ఆడియన్స్ ని ఊరించాయి. ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ కావడానికి అడుగడుగునా కథను అల్లుకున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా సక్సెస్ ఆయనకే కాదు,విజయ్ దేవరకొండకీ, సమంతకి కూడా డబుల్ జోష్ ఇస్తోంది.
50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఖుషి మూవీ. మూడు రోజుల్లోనే 35 కోట్లకు పైగా షేర్ వచ్చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. బౌన్స్ బ్యాక్ అయిన ఖుషీలో ఉన్నారు విజయ్ దేవరకొండ.